"స్వరాజ్యం నా జన్మహక్క"ని గర్జించిన తిలక్

"స్వరాజ్యం నా జన్మ హక్కు... దాన్ని సాధించి తీరుతాను" అంటూ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో "స్వరాజ్య"వాదాన్ని వినిపించిన జాతీయవాది బాలగంగాధర తిలక్. భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ.. కించపరిచేదిగా ఉన్న బ్రిటీష్ విద్యావ్యవస్థను ఈయన తీవ్రంగా నిరసించారు. జాతీయవాదులకు భావ ప్రకటనా స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఈయన సహించలేకపోయారు.

సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్రా లేకపోవడాన్ని కూడా తిలక్ నిరసించారు. వీటన్నింటినీ అధిగమించేందుకు "స్వరాజ్యమే" సహజమైన, ఏకైక మార్గమని నమ్మారు. అందుకే "స్వరాజ్యం నా జన్మహక్కు" అంటూ ఆయన ఇచ్చిన నినాదం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
జాతీయ స్ఫూర్తి రగిలించేందుకు...!
  ప్రజల్లో జాతీయస్ఫూర్తి రగిల్చేందుకు వీలున్న ఏ అవకాశాన్ని కూడా తిలక్ వదులుకోలేదు. శివాజీ ఉత్సవాలు, గణపతి ఉత్సవాలను నిర్వహించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి, వారిని జాతీయోద్యమంవైపు నడిపించారాయన. పత్రికల్లో రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో....      


లోకమాన్యుడిగా, భారత జాతీయోద్యమ పితగా వేనోళ్ల కీర్తింపబడిన బాలగంగాధర తిలక్ జన్మదినం నేడే...! 1856వ సంవత్సరం జూలై 23వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితంలో ఆయన విశేష ప్రతిభ కనబరిచేవారు. చిన్నప్పటినుంచి అన్యాయాన్ని సహించని మనస్తత్తవం ఆయనది. నిజాయితీ, ముక్కుసూటితనం అనేవి తిలక్‌కు సహజంగానే అబ్బాయి.

ఆ రోజుల్లో కళాశాలకు వెళ్లి ఆధునిక విద్యను అభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో తిలక్ కూడా ఒకరు. పదేళ్ల వయసులో పూణెలోని ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో విద్యనభ్యసించిన ఈయనకు మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడు సత్యభామ అనే పదేళ్ల అమ్మాయితో వివాహం జరిగింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరి 1877లో గణితంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత చదువును కొనసాగించిన తిలక్ ఎల్ఎల్‌బి పట్టాను కూడా సాధించారు.

1890వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేరిన తిలక్‌కు త్వరలోనే ఆ పార్టీ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. అందుకే స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మారు. ఆ రకంగానే ప్రజలను స్వరాజ్యం కోసం తిరగబడేందుకు సన్నద్ధులను చేశారు.

తిలక్ మార్గాలు అతివాద మార్గాలుగా భావింపబడ్డాయి. ప్రజలు, బ్రిటిషు వారిపై తిరగబడటమే స్వరాజ్య సాధనా మార్గంగా భావించారాయన. బ్రిటిషు వారివైన అన్ని వస్తువులను త్యజించాలని పిలుపునిచ్చారు. బిపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్ వంటి వర్ధమాన ప్రజానాయకులు ఆయనను సమర్ధించారు. ఈ ముగ్గురూ "లాల్, బాల్, పాల్"గా ప్రసిధ్ధులు.

భారత దేశపు అతి పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, బెంగాల్, పంజాబులు భారత ప్రజల ఆకాంక్షలకు, జాతీయవాదానికి రూపురేఖలను కల్పించాయి. అయితే... హింస, అవ్యవస్థలను తిలక్ ప్రోత్సహిస్తున్నారని గోఖలే విమర్శించారు. కాంగ్రెసులో ప్రజా ప్రాతినిధ్యం లేనందున తిలక్ ఆయన అనుయాయులు కాంగ్రెసును విడువవలసి వచ్చింది. దీంతో కాంగ్రెసు 1907లో రెండు ముక్కలయింది.

పాశ్చాత్య విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తిలక్... భారతదేశం ఔన్నత్యాన్ని గురించి బోధించాలన్న ఆశయంతో అగార్కర్, విష్ణుశాస్త్రి చిఫ్లుంకర్‌లతో కలసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ"ని స్థాపించారు. ఆ తర్వాత మరాఠా అనే ఆంగ్ల పత్రికలో, కేసరి అనే మరాఠీ పత్రికలో.. మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పేందుకు పదునైన భాషలో వాస్తవ పరిస్థితుల గురించి ఆయన విపులంగా రాశారు. బాల్య వివాహాలను నిరసించి, వితంతు వివాహాలను స్వాగతించారు.

ప్రజల్లో జాతీయస్ఫూర్తి రగిల్చేందుకు వీలున్న ఏ అవకాశాన్ని కూడా తిలక్ వదులుకోలేదు. శివాజీ ఉత్సవాలు, గణపతి ఉత్సవాలను నిర్వహించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి, వారిని జాతీయోద్యమంవైపు నడిపించారాయన. పత్రికల్లో రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఒకటిన్నరేళ్లు కారాగార శిక్షను అనుభవించిన ఆయన విడుదలయ్యాక స్వదేశీ ఉద్యమాన్న ప్రారంభించారు.

1906లో దేశద్రోహం నేరం కింద ఆరేళ్లు ప్రవాసశిక్షను కూడా తిలక్ అనుభవించారు. ఆ తరువాత 1916లో హోంరూల్ లీగ్‌ను స్థాపించి.. దాని లక్ష్యాలను వివరిస్తూ ఆయన మధ్యభారతం గ్రామగ్రామాన తిరిగారు. అదే సంవత్సరంలోనే అనీబిసెంట్ ఇదే ఉద్యమాన్ని మొదలుపెట్టి ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. ఆ తరువాత అనీబిసెంట్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని నమ్మి, వారు చేసిన ప్రకటనతో ఈ ఉద్యమాన్ని ఆపివేశారు. ఇలా తిలక్, అనీబిసెంట్ దారులు వేరుకావడంతో క్రమంగా హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది.

అయితే... ప్రజల్లో బాలగంగాధర తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920, ఆగస్టు ఒకటవ తేదీన ఆయన మరణించినప్పుడు జాతీయోద్యమం ఒక చుక్కాని లేని నావగా అయిపోతుందని చాలామంది దేశభక్తులు భయపడిపోయారు. అయితే "నాయకులు చరిత్రను సృష్టించరు, చరిత్రే నాయకుల్ని సృష్టిస్తుంద"న్న మాటను నిజం చేస్తూ, సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీజీ.. తిలక్ మరణంతో జాతీయోద్యమంలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడమేగాకుండా... ప్రజల గుండెల్లో మహాత్ముడిగా నిలిచారు.

వెబ్దునియా పై చదవండి