అందాల "అక్వేరియం"కూ ఉందో ముచ్చటైన కథ..!!

FILE
పిల్లలూ.. మీరు ఎంతో ముచ్చటపడి కొనుక్కుని, రంగు రంగుల చేపలతో ముచ్చట్లాడుతుండే "అక్వేరియం"కు కూడా ఓ అందమైన కథ ఉంది తెలుసా..? కథ అంటే కథ కాదు, చరిత్ర. అక్వేరియాలకు 4వేల ఏళ్ల చరిత్ర ఉందటండ్రా. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలలోనే సుమేరియన్లు రంగు రంగుల చేపలను తెచ్చుకుని ఇళ్లముందు గొయ్యితవ్వి పెంచుకునేవారట. అయితే వాళ్లు మనలాగా చేపలతో ముచ్చట్లాడేందుకు కాదుగానీ, కావాల్సినప్పుడల్లా వండుకుని తినేందుకే వాటిని పెంచుకునేవారట.

ఇక ఈజిప్షియన్లు అయితే చేపలను దేవతలతో సమానంగా భావించేవారట. చేపల్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని పెంచుకునేవారట. ఇక చరిత్ర సంగతి కాసేపలా పక్కనపెడితే.. ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ కనిపించే అక్వేరియంలు తొలిసారిగా 17వ శతాబ్దంలో, ఇంగ్లండ్ దేశంలో తయారయ్యాయట.

"అక్వేరియం" అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1850వ సంవత్సరంలో లండన్‌కు చెందిన ఫిలిప్ గోస్ అనే ప్రకృతి శాస్త్రజ్ఞుడు ఉపయోగించాడట. జలచరాలపై పరిశోధనల కోసం పెద్ద పెద్ద గాజు గదులను తయారు చేయించిన ఆయన వాటికి అక్వేరియం అని నామకరణం చేశాడట. తరువాత 1853లో లండన్‌ ప్రజలు చూసేందుకు వీలుగా అతిపెద్ద అక్వేరియంను ఏర్పాటు చేశారట.

FILE
సంపన్న దేశం అమెరికాలో అత్యధికంగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో చేపలది రెండో స్థానం కావటం గమనార్హం. అక్కడ సుమారు 75 లక్షల ఇళ్లలో అక్వేరియంలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి పది ఇళ్లలో ఒక ఇంటికి అక్వేరియం ఉందన్నమాట. ఇక ఈ అక్వేరియంలలో పెంచుకునే చేపల్లో 20 కోట్లకు పైగా రకాలున్నాయిన్నాయంటే నోళ్ళెళ్లబెట్టేస్తాం కదూ.. అయినా అది నిజం.

తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. ప్రతి సంవత్సరం 3 కోట్ల సముద్ర జీవులు ఈ అక్వేరియంలలోకి చేరుతున్నాయట. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం అట్లాంటాలోని జార్జియాలో ఉంది. అందులో సుమారు 500 జాతులకు చెందిన లక్షకుపైగా జలచరాలున్నాయి. అన్నట్లు ఈ అక్వేరియంలో 81 లక్షల మిలియన్ గ్యాలన్ల నీటిని పోస్తారట పిల్లలూ..!

స్థూపం ఆకారంలో ఉండే అతిపెద్ద అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో కొలువై ఉంది. నిట్టనిలువుగా 82 అడుగుల ఎత్తు ఉండే ఈ అక్వేరియంలో 9 లక్షల గ్యాలన్ల ఉప్పునీరు, 56 జాతులకు చెందిన 2,500 రకాల చేపలను పెంచుతున్నారు. అక్వేరియాలలో పెంచే చేపలలోకెల్లా అతి ఖరీదైన చేప ఏదంటే "ప్లాటినం అరోవనా చేప". గరిష్టంగా 40 లక్షల రూపాయల విలువచేసే ఈ చేపలు దొరకటం చాలా అరుదు. ఇది ఎక్కువగా సింగపూర్‌లో దొరుకుతుంది. రంగు రంగుల చేపలతో అలరించే అందాల అక్వేరియం సమాచారం భలే గమ్మత్తుగా ఉంది కదూ పిల్లలూ..!!

వెబ్దునియా పై చదవండి