అఫ్రోడైట్ దేవత కన్నీటి చుక్కే గులాబీ పువ్వులా మారిందట..!
FILE
అందంగా అలరించే గులాబీ పువ్వుల వెనుక కవిత్వాలే కాదు. బోలెడన్ని కథలు కూడా ఉన్నాయి పిల్లలూ..! గ్రీకు పురాణాల ప్రకారం.. అఫ్రోడైట్ దేవత, అడోనిస్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆమె కోసం అతడు విరహంతో బాధపడితే, ఆమె విడచిన కన్నీటి చుక్కలే గులాబీ పువ్వుల్లా మారిపోయాయట.
అదే విధంగా.. రోమన్ సామ్రాజ్యంలో రోడాంతే అనే ఓ అందమైన అమ్మాయి ఉండేదట. ఆమెను వరించి వచ్చే వాళ్లంతా ఓరోజు ఆమె వెంట పడటంతో ఓ దేవత గుడిలోకెళ్లి దాక్కుందట. అయినా వాళ్లు వదలకుండా గుడి తలుపులను బద్ధలు కొట్టి లోపలి వచ్చేందుకు ప్రయత్నించారట. అప్పుడు రోడాంతే ఆ దేవతను ప్రార్థించగా, ఆమెను ఓ అందమైన పువ్వుగా, వెంటబడిన వాళ్లందరినీ ముళ్లుగా మార్చేసిందట. ఆ పువ్వే ఇప్పుడు మనం చూస్తున్న గులాబీ.
హిందూ పురాణాల ప్రకారం చూస్తే.. బ్రహ్మ, మహావిష్ణువులు ఓసారి ఏ పువ్వు అందమైనదని వాదించుకున్నారట. విష్ణువు గులాబీని చూపిస్తే బ్రహ్మ ఒప్పుకుని, ఆ పువ్వుల నుంచే లక్ష్మీదేవిని పుట్టించాడనే కథ ప్రచారంలో ఉంది. ఈ భూమిపైన గులాబీలు దాదాపు 4 కోట్ల సంవత్సరాల నుంచే ఉన్నాయనేందుకు కొన్ని శిలాజ ఆధారాలు సైతం అందుబాటులో ఉన్నాయి కూడా.
ఆ సంగతి అలా పక్కనబెడితే.. ప్రపంచం మొత్తంమీదా దాదాపు 30 వేల రకాల గులాబీ పువ్వులు ప్రస్తుతం పూస్తున్నాయి. గులాబీలు మొదట యూరోప్‌లో పుట్టి, దేశదేశాలకు పాకాయని చెబుతారు. క్రీస్తుపూర్వం 3000 నాటి పిరమిడ్లలో సైతం ఇవి ఉన్నట్టు కనుగొన్నారు.
వివిధ దేశాల రాజులు, రాణులు గులాబీలను ఎంత ఇష్టపడ్డారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాణీ క్లియోపాత్ర కోటలో నడిచే దారులలో గులాబీ రేకులను పరిచేవారు. ప్రతి రోజూ ఆమె స్నానానికి వాడే నీటిలో లక్షలాది గులాబీలను కలిపేవారట. రాజు కన్ఫ్యూసియస్ కేవలం గులాబీల పెంపకంపై 600 పుస్తకాలతో గ్రంథాలయాన్ని నెలకొల్పాడట.
* పర్షియా రాజు నెబుచజర్ కోసం ప్రతి రోజూ గులాబీ రేకులతో కొత్త పరుపును కుట్టాల్సిందేనట. ఇందుకు వేలాది గులాబీలను వాడేవారు. అలాగే బాగ్దాద్ సుల్తాన్ ఏటా 30,000 కూజాల గులాబీ అత్తరును ఉపయోగించేవాడు. నెపోలియన్ చక్రవర్తికి గులాబి రేకుల్లో అద్భుత శక్తులున్నాయని నమ్మకం. అందుకే వాటి రసాన్ని సారాయిలో కలిపి తాగేవాడట. ఇంకా గులాబీల రసాన్ని సైనికుల గాయాలపై పూయించేవాడు. ఆయన భార్య జెసేఫైన్ 250 రకాల గులాబీ మొక్కల్ని పెంచేదట.
* ప్రపంచ వ్యాప్తంగా ఏటా 15 కోట్ల గులాబీ మొక్కల అమ్మకాలు జరుగుతున్నాయి. జర్మనీలో ఓ చర్చి గోడపై మొలిచిన గులాబీ మొక్క వెయ్యేళ్లుగా పుష్పిస్తూనే ఉండటం ఇప్పటికీ ఓ విచిత్రం. ఇదొక ప్రపంచ రికార్డు కూడా. ప్రపంచంలోనే అతి పెద్ద గులాబీల తోట అమెరికాలో ఉంది. 22 ఎకరాలుండే ఈ తోటలో వేలాది రకాల గులాబీలు కనువిందు చేస్తాయి. అసాధారణంగా ఆకుపచ్చ, నలుపు రంగుల్లోనే కాదు, ఒకే గులాబీలో పలు రంగులుండేవి కూడా నేడు లభ్యమవుతున్నాయి.