గజపతులు కళింగ ప్రాంతాన్ని ( ప్రస్తుతం ఒరిస్సా) రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. వీరి రాజ్యం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలు, మధ్య ప్రదేశ్, బీహార్‌లలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. వీరి పాలన కాలం క్రీ.శ 1434 నుంచి 1541. గజపతి వంశ స్థాపకుడు కపిలేంద్ర దేవవర్మ, గజపతి.
అతని తర్వాత ఆ వంశంలో చెప్పుకోదగిన పాలకులు పురుషోత్తమ దేవవర్మ, ప్రతాపరుద్ర దేవవర్మ. ఆ వంశంలో చివరి పాలకుడై కాఖరువ దేవ గజపతి. ఇతడిని భోయి వంశస్థుడైన గోవింద విద్యాధరుడు సంహరించాడు. దాంతో కళింగరాజ్యంలో గజపతి వంశపాలన ముగిసి, భోయి వంశపాలన మొదలైంది.
మొదటి గజపతి రాజు కపిలేంద్ర దేవ వర్మ క్రీ.శ 1448లో ఆంధ్రప్రదేశంలోని రెడ్డి రాజ్యాన్ని జయించాడు. దాంతో ఆంధ్రప్రదేశంలో గజపతుల పాలన ప్రారంభమైంది. తర్వాత అతడు బహమనీ రాజ్యంపైకి దండెత్తి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాలను కూడా జయించి రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం మీద దండెత్తి నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలను కూడా జయించాడు. దాంతో ఆంధ్ర దేశంలో మూడు వంతుల భాగం గజపతుల పాలనలోకి వచ్చింది.
కపిలేంద్ర గజపతి 1464లో మరణించిన తర్వాత అతని కుమారుడు పురుషోత్తమ దేవ వర్మ పాలన సాగించాడు. క్రీ.శ 1500 ప్రాంతంలో ప్రతాప రుద్ర గజపతి ఆంధ్ర దేశాన్ని పాలించాడు. అతడు సమర్థుడైన పాలకుడే కాకుండా మంచి రచయిత కూడ. ప్రతాప రుద్ర గజపతి 'సరస్వతీ విలాసం' అనే గ్రంథాన్ని రచించాడు. గజపతులు ఆంధ్ర దేశాన్ని 'దండ, పాడి' అనే భాగాలుగా విభజించారు. వారు ఆంధ్రదేశంలో ఒరిస్సాకు చెందిన పరిపాలన పద్ధతులను ప్రవేశపెట్టారు.