పిల్లలూ... కొవ్వొత్తిని వెలిగించినప్పుడు వత్తి దగ్గర నల్లగా ఉంటుంది కదా..! అలా ఎందుకుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా...? మరేంలేదండర్రా... కొవ్వొత్తిని వెలిగించినప్పుడు "ఫారఫిన్" అనే మైనం కరిగి బాష్పీభవనం చెంది వాతావరణంలోని గాలితో కలిసి, ఆక్సీకరణం చెంది మండుతుంది.
వత్తి నుంచి దూరంగా పోయేకొద్దీ గాలి, మైనం నిష్పత్తి మారుతుండటంవల్ల కొవ్వొత్తి మంటలో నీలం, ఊదా, పసుపు రంగులు కనిపిస్తాయి. వత్తికి దగ్గరగా ఉండే ప్రదేశంలో మైనం ఎక్కువగా ఉండి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మైనం మండదు, కనుక ఆ ప్రాంతం నల్లగా, చీకటిగా ఉంటుందంతే..!
ఈ ప్రాంతానికి బయట మైనం, గాలుల మిశ్రమం మండేందుకు అనువుగా ఉంటుంది కాబట్టి.. అక్కడి మంట నీటి ఊదా రంగుల కలయికతో ఉంటుంది. ఇక, వెలుపల ఉండే ప్రాంతంలోని మంట పసుపు రంగులో ఉండేందుకు మంటలో బాగా వేడెక్కిన కార్బన్ కణాల వికీరణ ప్రభావం కారణంగా ఉంటుంది.