గ్రాహంబెల్ తొలి "వాణిజ్య టెలిఫోన్ సర్వీసు"

నేడు మనం వాడుతున్న ఫోన్లకు మాతృక అయిన "టెలిఫోన్" అనేదాన్ని కనిపెట్టింది "అలెగ్జాండర్ గ్రాహెంబెల్" అని మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. గ్రాహెంబెల్.. కెనడాలోని ఓంటారియో రాష్ట్రంలోని హామిల్టన్ అనే ప్రాంతంలో మొట్టమొదటి వాణిజ్య టెలిఫోన్ సర్వీసును ప్రారంభించిన రోజుగా చరిత్రలో జూన్ 20వ తేదీ సాక్షీభూతంగా నిలుస్తుంది.

అలెగ్జాండర్ గ్రాహెంబెల్ స్కాట్లాండులోని ఎడిన్‌బర్గ్ అనే ప్రాంతంలో మార్చి 3, 1847వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు అలెగ్జాండర్ మెల్‌విల్లే బెల్ (ప్రొఫెసర్) కాగా, తల్లి పేరు ఎలిజా గ్రేస్. గ్రాహెంబెల్ చిన్నవయసునుంచే సహజంగానే అనేక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా చిన్నారి గ్రాహెంబెల్ ఆ రోజుల్లోనే పరిశీలనా శక్తి అధికంగా ఉండేది.

తన పక్కింట్లో నివాసముండే తన స్నేహితుడు బెన్ హెర్డ్‌మెన్ సహాయంతో గ్రాహెంబెల్ 12 ఏళ్ల ప్రాయంలోనే "ఇన్వెంట్" అనే పేరుతో చిన్న వర్క్‌షాప్‌ను నిర్వహించారు. సున్నిత స్వభావి అయిన బెల్ కవిత్వం, పెయింటింగ్, సంగీతంపై కూడా మక్కువగా ఉండేవారు. ఈయనలోని కళలను తల్లి ఎంతగానో ప్రోత్సహించేవారు.

అయితే తన తల్లికుండే చెవిటితనం కారణంగా బెల్ తీవ్రంగా మధనపడేవారు. దీంతో ఆమె పక్కన కూర్చుని మౌనంగా సంభాషించేవాడు. అంతేగాకుండా, రాన్రానూ ఆయన మాట్లాడటంలో స్పష్టతను ఏర్పరచుకున్నాడు. ఈ రకంగా తల్లితో తన భావాలను స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలిగేవాడు. ఆమె కొడుకు మాటలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగేది. ఒక రకంగా చెప్పాలంటే, బెల్‌లోని విజ్ఞాన తృష్ణకు తల్లి చెవిటితనం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.

ఇలా కనిపెట్టినదే టెలీఫోను. దీనిని 1876 రూపొందించిన గ్రాహెంబెల్ మొదటిసారిగా ఉపయోగిస్తూ, పక్కగదిలో ఉన్న వాట్సన్‌తో మాట్లాడారు. టెలీ ఫోను అంటే... టెలీ అనగా దూర, ఫోను అంటే వాణి... దూరవాణి అని అర్థం. ఇది సాధారణంగా ఇద్దరు, మరికొన్ని సమయాలలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది సంభాషించుకునేందుకు ఉపయోగిస్తుంటారన్న సంగతి మనకు తెలిసిందే.

గ్రహంబెల్‌ను చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నప్పటికీ... ఆయన వివిధ రంగాలలో ఆసక్తిని కనబరచాడు. 1880వ సంవత్సరంలో ఈయన టెలిఫోన్ ఆవిష్కరణకుగాను ఫ్రెంచి ప్రభుత్వం నుండి "వోల్టా" పురస్కారాన్ని అందుకున్నాడు. కాగా అప్పట్లో దీని విలువ 50,000 ఫ్రాంకులు అంటే సుమారు పదివేల డాలర్లన్నమాట...!

తన జీవితకాలమంతా రకరకాల పరిశోధనలతో గడిపిన గ్రాహెంబెల్ తన 75 సంవత్సరాల వయసులో చక్కెర వ్యాధికి గురయ్యారు. ఈ వ్యాధి కారణంగానే 1922 ఆగస్టు 2వ తేదీన మరణించారు.

వెబ్దునియా పై చదవండి