చేతికందిన చందమామ "చక్రపాణి"

FILE
తెలుగు రచయితగా, పత్రికా సంపాదకులుగా, సినీ నిర్మాతగా, దర్శకుడిగా పలు విభిన్న పార్శ్వాలను కలిగి ఉన్న బహుభాషావేత్త చక్రపాణి. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరైన చక్రపాణిగారు... కష్టపడితే ఫలితం ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి.

తనదైన ఓ ప్రత్యేక తెలుగు నుడికారంతో శరత్‌బాబు బెంగాలీ నవలను అనువాదం చేసిన చక్రపాణి... ఆ తెలుగు నవలా రచయిత శరత్ అనే అందరూ అనుకునేటట్లు, తను బెంగాలీ కుటుంబాలతో ఉన్నట్లుగా భ్రమింపజేశారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో, ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఈయన తగినంత పాఠశాల విద్య లేకపోయినా, తన సుదీర్ఘ సాధనచేత నాలుగైదు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. తన కలంపేరునే సొంత పేరుగా చేసుకున్న చక్రపాణిగారి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో...

చక్రపాణి గారి అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. ఆయన 1908వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన గుంటూరు జిల్లా, తెనాలి ఐతానగరంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి కృషిచేస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు.
అమృత హృదయుడు
అరమరికలు, దాపరికాలు చక్రపాణిగారికి గిట్టవు. చెప్పదలుచుకుంది కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పటం ఆయన స్వభావం. ఇతరులు ఏమనుకుంటారోనన్న భావం వీరికి ఏ కోశానా ఉండేది కాదు. భేషజాలు లేని అమృత హృదయుడు. తనలో ఎన్ని బాధలున్నా.. అన్నీ దాచుకుని లోకానికి చల్లని....


హిందీలో ప్రావీణ్యం ఉండటం వల్ల రచన, అనువాదాలలో అభిరుచి ఏర్పడింది. చిత్రగుప్త,వినోదిని వంటి పత్రికలకు రచనలు పంపేవారు. వ్రజ నందన శర్మ చక్రపాణిగారి రచనా కౌశలాన్ని గమనించి "చక్రపాణి" అనే కలంపేరుతో రాయమని సూచించడంతో అప్పటినించీ ఆ కలంపేరే ఆయన పేరుగా మారిపోయింది. ఆ తరువాత స్వయంకృషితో ఆయన సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో నైపుణ్యం సాధించారు.

క్షయ వ్యాధిగ్రస్తుడైన చక్రపాణిగారు 1932లో మదనపల్లిలోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాషను కూడా నేర్చుకొన్నారు. ఆపై బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా శరత్‌బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే... శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాలకు మూలం బెంగాళీ అని చెప్పినా చాలా మంది నమ్మేవారు కాదు. ఆ తరువాత తెలుగులోనూ చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు.

FILE
1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం వీరు మాటలు రాసారు. బి.ఎన్. నాగిరెడ్డిగారు రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు. అలా 1949-1950లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం... ఇద్దరూ కలిసి విజయా ప్రొడక్షన్స్‌ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు.

చక్రపాణిగారు, నాగిరెడ్డిగారు కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి... అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక వారిద్దరూ కలసి 1945లో ప్రారంభించిన ఆంధ్రజ్యోతి పత్రిక, 1947 జులైలో పిల్లల కోసం ప్రారంభించిన చందమామ జయప్రదం అయ్యాయి. నాగిరెడ్డి, చక్రపాణిల పేర్లు తెలుగు దేశమంతా మార్మోగాయి.

చందమామ ఈ రోజు పన్నెండు భారతీయభాషల్లో అపూర్వమైన రీతిలో ప్రచురించబడటానికి చక్రపాణిగారు వేసిన బలమైన పునాదులే కారణంగా చెప్పవచ్చు. అంతేగాకుండా, యువ ప్రచురణల ద్వారా చౌకధరలకు ఉత్తమసాహిత్యాన్ని అందించి ప్రజానీకంలో సాహిత్య విలువలను పెంచిన వ్యక్తిగా ఆయన సేవలు అజరామరం. తను సృష్టించిన ప్రతి పాత్ర, రచయితగా ఆయన కలం నుండి వెలువడిన ప్రతిమాట తెలుగువారి నిత్య జీవితాల్లోనుంచే వెలికితెచ్చి, ప్రజలకు ప్రీతిపాత్రుడయ్యారు.

రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను తెలుగు ప్రజలకు రుచి చూపించి, “చేతికందిన చందమామ”గా పిల్లల హృదయాలలో సైతం చోటు సంపాదించిన శ్రీ చక్రపాణి సెప్టెంబరు 24, 1975 సంవత్సరంలో పరమపదించారు. చక్రపాణిగారి ఖచ్చితమైన కాలిక్యులేషన్, కఠోర పరిశ్రమ, నిబద్ధత, తన మీద తనకు గల అచంచల విశ్వాసాలే... తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాత, దర్శకుల్లో ఒకరిగా ఆయనని నిలబెట్టింది.

అరమరికలు, దాపరికాలు చక్రపాణిగారికి గిట్టవు. చెప్పదలుచుకుంది కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పటం ఆయన స్వభావం. ఇతరులు ఏమనుకుంటారోనన్న భావం వీరికి ఏ కోశానా ఉండేది కాదు. భేషజాలు లేని అమృత హృదయుడు. తనలో ఎన్ని బాధలున్నా.. అన్నీ దాచుకుని లోకానికి చల్లని ప్రశాంతమైన చిరునవ్వుల్ని ప్రసాదించిన స్తితప్రజ్ఞుడీయన... ఈ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... ఆయనకిదే మా తెలుగు వెబ్‌దునియా శ్రద్ధాంజలి...!!

వెబ్దునియా పై చదవండి