బెంగళూరు పట్టణంలో చిన్నపిల్లలు చూడాల్సిన స్థలాల్లో ఒకటి జవహర్లాల్ నెహ్రూ ప్లానెటోరియం. ప్లానెటోరియంను తెలుగులో నక్షత్రశాల అని అంటారని తెలుసు కదూ పిల్లలూ..? ఈ నక్షత్రశాలను సందర్శించటంవల్ల ఖగోళ శాస్త్రానికి సంబంధించి గ్రహాలు, నక్షత్రాలు, వాతావరణానికి సంబంధించిన బోలెడంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మనం చెప్పుకునే జవహర్లాల్ నెహ్రూ నక్షత్రశాలలో ప్రతిరోజూ రెండుసార్లు ఖగోళశాస్త్ర ప్రదర్శనలు జరుగుతుంటాయి. వీటిని చూసిన పిల్లలు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాస్తవాలను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ నక్షత్రశాల పైకప్పు 15 డయామీటర్ల వైశాల్యంతో, ఒకేసారి 210 మంది కూర్చుని చూసే విధంగా ఉంటుంది.
బెంగళూరు సిటీ కార్పోరేషన్ వారు ఈ జవహర్లాల్ నెహ్రూ నక్షత్రశాలను 1989లో నిర్మించారు. బెంగళూరు అసోసియేషన్ అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేసి, 1992లో ఈ నక్షత్రశాల నిర్వహణ బాధ్యతలను దానికి సిటీ కార్పోరేషన్ బదిలీ చేసింది. కాగా.. ఈ నక్షత్రశాలలోని ప్రొజెక్టర్‌ను జర్మనీకి చెందిన కార్ల్జీస్ అనే కంపెనీ ఇవ్వగా, దాంతోపాటు మరికొన్ని కెమెరాల సహాయంతో ఇక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు.
ప్రతి సంవత్సరం ఈ నక్షత్రశాలను సుమారు 2 లక్షలమంది సందర్శిస్తుంటారని ఒక అంచనా. ఖగోళ సమాచారం తెలియజేసేలా అనేక ఫొటోలు, కార్టూన్లు, పెయింటింగ్స్ కూడా జవహర్లాల్ నెహ్రూ ప్లానెటోరియంలో ఉన్నాయి. అలాగే ప్లానెటోరియం ఆవరణలోని సైన్స్ పార్క్ కూడా పిల్లల్లి భలే ఎంటర్టైన్ చేస్తుంది. ఉత్సాహంతోపాటు విజ్ఞానాన్ని కూడా అందించే ఈ నక్షత్రశాలను పిల్లలు తప్పకుండా చూసితీరాల్సిందేనని చెప్పవచ్చు.