సాధారణంగా విషం అంటేనే ఎవరైనా భయంతో వణికిపోతాం. విషం తింటే చనిపోతారని అందరికీ తెలిసిన విషయమే. మరి విష జంతువులైన తేళ్లు, పాములను కొంతమంది అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తుంటారు కదా.. అలాంటప్పుడు వారికేమీ కాదా..? వాళ్లు చనిపోరా..?
విష జంతువులను మింగినప్పటికీ ఏమీ కాదు పిల్లలూ.. వాటిలోని విషం ఏమీ చేయదు కాబట్టి వాళ్లు చనిపోరు. ఎందుకంటే విషం అనేది కేవలం కొన్ని మాంసకృత్తుల రూపం మాత్రమే. మనం పప్పుదినుసుల నుంచి, మాంసం నుంచి శరీరానికి సమకూర్చుకునే ప్రొటీన్ల మాదిరిగానే.. పాములు, తేళ్ల శరీరంలో గల విషం కూడా ఒక ప్రొటీన్ రూపమే.
అయితే పాములు, తేళ్ల శరీరంలోని అవాంఛనీయమైన ప్రొటీన్లు రక్తంలో కలిసినప్పుడు మాత్రమే ప్రాణాపాయం సంభవిస్తుంది. లేకపోతే ఏమీ కాదు. ముఖ్యంగా మన ఆహారవాహిక సక్రమంగా, నోటిలో ఎలాంటి గాయాలు లేకుండా ఉన్నట్లయితే ఎంచక్కా త్రాచుపాము విషాన్ని కూడా గుటుక్కుమనిపించవచ్చు.
అలాగే.. పాములు, తేళ్లు, బల్లులను కూరలాగా ఉడికించినట్లయితే వాటిలోని ప్రొటీన్ల నిర్మాణం మారిపోయే అవకాశం ఉంటుంది. బల్లుల విషయానికి వస్తే.. వాటి విషంలో ప్రొటీన్లతోపాటు రకరకాల పదార్థాలు కూడా కలగలసి ఉంటాయి. కాబట్టి బల్లి పడిన, బల్లి విషం కలిసిన ఆహార పదార్థాలను తిన్నట్లయితే వాంతులు, విరేచనాలతో బాధపడే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తేళ్లు, పాముల విషంలో మాంసకృత్తులే కదా ఉన్నాయి, జీర్ణమయిపోతాయిలే అనుకుంటూ వాటిని తినేందుకు సాహసించటం ప్రమాదకరం పిల్లలూ.. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు. ప్రత్యేక శిక్షణ పొందిన వ్యక్తులు తేళ్లు, పాములను తినటం చేస్తుంటారు. వాళ్లు అలా తిన్నప్పుడు చనిపోరా అనే ప్రశ్నకు, జవాబును కనుక్కునే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ వ్యాసాన్ని చదువుకున్నాం తప్పిస్తే.. వారిలాగా ప్రయత్నాలు చేయాలని కాదు. దీన్ని తప్పక గుర్తిస్తారు కదూ..?!