ఆమెను చూస్తే.. ఎలాంటి రోగాలైనా ఇట్టే పారిపోతాయి. ఆమె పేరు చెబితే అన్నార్తుల కడుపులు నిండిపోతాయి. ఆమె పేరు వినగానే ప్రపంచం కళ్ళల్లో కాంతి రేఖలు ప్రసరిస్తాయి. ఆమె పీల్చే గాలిలోని శాంతి పవనాలు సైతం హీనులను, ధీనులను ఆప్యాయంగా తాకుతాయి. ఆమె కరుణామయి, అమృతమయి. ఆమే విశ్వమానవాళికి అమ్మ అయిన మదర్ థెరిస్సా. అనాధలకు ఆమె ఒక ఆలంబన. అతి సామాన్య జీవితం నుంచి అసాధారణ వ్యక్తిత్వం ధరించిన మదర్ జన్మదినం నేడే...! ఈ సందర్భంగా అమ్మ స్మృతిలో...
"ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. పేదలు నాకు దేముడిచ్చిన వరాలు" అంటూ జాతిని మేల్కొల్పిన మన మదర్ థెరీసా... మాసిడోనియాలోని ఓ ఆల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో గోన్షా బోజాక్షువు అనే పేరుతో ఆగస్టు 26వ తేదీ 1910వ సంవత్సరంలో జన్మించారు.
ఆగ్నస్‌కు 8 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె తండ్రి నికోలా గోక్షా బోజాక్షువు వ్యాధికి గురై మరణించారు. ఆయన మరణం తరువాత రోమన్ కాథలిక్‌గా పెరిగిన ఆమె, అప్పట్లోనే మిషనరీలపై ఇష్టం పెంచుకున్నారు. 12 సంవత్సరాల వయసులోనే మిషనరీలలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడు కుదరక పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఇల్లు వదలి సిస్టర్స్ ఆఫ్ లోరెటొలో మిషనరీగా చేరారు. ఆటుపై ఏనాడు కూడా ఆగ్నస్ తన కుటుంబ సభ్యులను చూడలేదు.
గుడిసెల్లేవు వెళ్లిపో.. అన్నారట..!
మరణానికి ముందు కొద్ది కాలం క్రితం మదర్ ఓ సారి ఇలా అన్నారు... "నేను స్వప్నంలో స్వర్గ ద్వారం వద్ద నిలబడి ఉన్నాను.. అక్కడ నాకెదురుగా నిలబడి ఉన్న సెయింట్ పీటర్ నాతో అన్నారు.. ఇక్కడ నీ కోసం గుడిసెలు లేవు. నువ్వు భూమి మీదకే వెళ్లమని" చెప్పారట...!
ముందుగా ఆగ్నస్ ఐర్లాండ్ దేశంలోని రాత్‌ఫార్న్‌హామ్‌లో ఉన్న లోరెటో అబ్బేలో ఇంగ్లీషు భాష నేర్చుకునేందుకు వెళ్లారు. ఆ తరువాత 1929లో భారతదేశానికి వచ్చిన ఆమె హిమాలయాల దగ్గర్లోని డార్జిలింగ్‌లో తన మిషనరీ జీవితాన్ని ప్రారంభించారు. 1931 మే 24వ తేదీన సన్యాస జీవితాన్ని ప్రారంభించిన ఆగ్నస్... తన పేరును థెరీసాగా మార్చుకున్నారు. ఆపై 1937, మే 14న పూర్తిగా సన్యాస జీవితానికి అంకితమయ్యారు.
ఈ సమయంలో తూర్పు కలకత్తాలోని "లోరెటొ కాన్వెంట్ స్కూల్"లో ఉపాధ్యాయినిగా పనిచేసిన థెరిస్సా.. ఆ వృత్తిలో సంతోషాన్ని పొందినప్పటికీ, చుట్టుప్రక్కల ప్రబలి ఉన్న పేదరికాన్ని చూసి చలించిపోయేవారు. అక్కడి మురికి వాడల్లో పేద ప్రజల బ్రతుకు జీవనం చూసి చలించిపోయి 1946లో స్కూలును వదలి పేదలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నుంచి అంగీకారం పొందారు.
ఎలాంటి నిధులు లేకుండా తొలిసారిగా భారత్‌లో అనాథ పిల్లలకు ఓపెన్ ఎయిర్ స్కూల్‌ను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆమె సేవానిరతిని గుర్తించిన వాలంటీర్లు మదర్‌కు సాయంగా ఆ స్కూల్‌లో చేరారు. అప్పుడే ఆర్ధికపరమైన సాయం కూడా ఆమెకు అందడం మొదలయ్యింది.
దీంతో మదర్ మరికాస్త ముందుకెళ్లి అక్టోబర్ 7, 1950లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే సంస్థను స్థాపించారు. అనాథలకు ప్రేమ... కరుణ.. వాత్సల్యాన్ని పంచడమే లక్ష్యంగా ప్రారంభమైన మిషనరీష్ ఆఫ్ ఛారిటీ ఇంతింతై వటుడింతై అన్నట్లు దేశదేశాలకు పాకింది. వృద్ధులకోసం... కుష్టువ్యాధిగ్రస్తుల కోసం, పేద రోగులకు వైద్య సాయం వంటి ఎన్నో ఎన్నెన్నో పథకాలను ఆమె ఆవిష్కరించారు.
ఈ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఇటలీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తదితర దేశాల్లో అమలు అవుతున్నాయి. ఆ సమయంలో 1971లో 23వ పోప్ జాన్ శాంతి అవార్డు.. అనంతరం అంతర్జాతీయ శాంతి స్థాపనకై కృషి చేసినందుకు 1972లో నెహ్రూ పురస్కారం, 1979లో బాల్జాన్ అవార్డులు మదర్‌కు వచ్చాయి. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 87 దేశాల్లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ తరపున అనేక వేల మంది సేవలందిస్తున్నారంటే.. మదర్ మాటలు, ఆమె చూపిన బాట ఎంతమందిని ప్రభావితం చేశాయో అవగతమవుతుంది.
1983లో తొలిసారిగా గుండెపోటుకు గురైన మదర్ 1989లో శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో చివరికి 1997లో సెప్టెంబర్ 5న తనువు చాలించారు. "దేవుడు ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని, నన్ను కూడా అలాగే పంపించాడు. ఆయనకు పేదలంటే జాలి, ప్రేమ ఎక్కువగా ఉన్నాయ"ని తరచుగా చెప్పే మదర్.. ఈ రకంగా దేవుడి వద్దకే శాశ్వతంగా వెళ్లిపోయారు.
మరణానికి ముందు కొద్ది కాలం క్రితం మదర్ ఓ సారి ఇలా అన్నారు... "నేను స్వప్నంలో స్వర్గ ద్వారం వద్ద నిలబడి ఉన్నాను.. అక్కడ నాకెదురుగా నిలబడి ఉన్న సెయింట్ పీటర్ నాతో అన్నారు.. ఇక్కడ నీ కోసం గుడిసెలు లేవు. నువ్వు భూమి మీదకే వెళ్లమని" చెప్పారన్నారు. కడుపుతెంచుకు పుట్టకపోయినా విశ్వమానవాళిని సొంత బిడ్డల్లాగా చూసిన ఆ మాతృమూర్తికి పేద ప్రజలమీద ఎంత అభిమానం ఉందో పైన ఆమె చెప్పిన మాటల్లోనే గోచరిస్తోంది కదూ...!!
అందుకే... మదర్ థెరిస్సా గురించి చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు.. అందరి హృదయాలు ద్రవిస్తాయి. జీవితం అంతా దీనుల సేవకే అంకితం చేసిన ఆ మహనీయురాలంతటి వ్యక్తిని ఇకముందు చూడలేమేమో అనిపిస్తుంటుంది. "ప్రతి మనిషికి ప్రేమను పంచాలి... సేవకన్నా జీవితానికి మరో అర్థం లేదు" అనే సంకల్పం అనే ఆశయాన్ని, ఆదర్శాన్ని మనకు చూపెట్టిన ఆ ధన్యజీవికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ...!!