వీధి బాలల కోసం "బొమ్మల బ్యాంకు"

చిన్నపిల్లలు ఎవరికయినా సరే బొమ్మలంటే చాలా ఇష్టం. అమ్మానాన్నలు, తాతయ్యలు, అమ్మమ్మలు, అయినవాళ్లు, బంధువులు ఉన్న చిన్నారులకి బొమ్మలు కొనిస్తుంటారు. ఆ బొమ్మలతో వాళ్లు ఎంచక్కా ఆడుకుంటారు. మరి... అనాథపిల్లలకు, వీధి బాలలకు బొమ్మలు ఎవరిస్తారు..? వాళ్లకి కూడా బొమ్మలతో ఆడుకోవాలని ఉంటుంది కదా..? అందుకే ఇలాంటి వారికోసం ఓ "బొమ్మల బ్యాంకు" ఏర్పడింది. ఈ బొమ్మల బ్యాంకే అనాథ పిల్లలు ఆడుకునేందుకు బొమ్మల్ని సేకరించి ఇస్తుంది.

అందుకనే పిల్లలూ... మీరు ఆడుకునే బొమ్మలు పాడయిపోయినా, పాతబడినా పడేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టి బొమ్మల బ్యాంకు (టాయ్ బ్యాంక్) వాళ్లకు ఇచ్చేయండి. వాళ్లు ఆ బొమ్మలన్నింటికీ మరమ్మత్తులు చేసి వీధి బాలలు ఆడుకునేందుకు ఇస్తారు. వాటితో ఆ పిల్లలు హాయిగా ఆడుకుంటారు. ఈ రకంగా అనాథ పిల్లల్ని సంతోషపెడుతోన్న ఈ టాయ్ బ్యాంక్ మన దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో ఉంది.

ఈ టాయ్ బ్యాంక్ నిర్వహణ కోసం కొంతమంది వాలంటీర్లు పనిచేస్తుంటారు. ఎవరైనా పాత బొమ్మలు తమ వద్ద ఉన్నాయని ఫోన్ చేస్తే చాలు వాళ్లే స్వయంగా వచ్చి వాటిని తీసుకుపోతారు. ఆపై వాటిని చక్కగా మార్చి బ్యాంక్‌లో భద్రపరచి ఉంచుతారు. అయితే బొమ్మలతో ఆడుకోవాలని అనుకునే పిల్లలు ఈ బ్యాంకుకు వచ్చి సభ్యులుగా చేరాలి.

అప్పుడు బ్యాంక్ వాళ్లు ఆ పిల్లలకు ఒక కార్డు ఇస్తారు. దాన్ని గనుక బ్యాంక్‌లో చూపిస్తే వాళ్లు బొమ్మలను ఇస్తారు. ఒక కార్డుమీద ఒక్కొక్కరికి ఒక్కో బొమ్మను ఇస్తారు. దాంతో ఆడుకోవటం అయిపోయిన తరువాత తిరిగి ఇచ్చేసి, అవసరమైతే మరో బొమ్మను అడిగి తీసుకుని ఆడుకోవచ్చు.

అన్నట్టు పిల్లలూ.. ఈ టాయ్ బ్యాంకు బొమ్మల రూపంలోనే కాదు నగదు, పుస్తకాలు, బట్టల రూపంలో కూడా సాయాన్ని అందజేస్తోంది. వీధి బాలల కోసం తోలు బొమ్మలాటలు, మేళాలు, వైద్య శిబిరాల్లాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎమ్సీడీ) పాఠశాలల్లో చదువుతూ నిర్లక్ష్యానికి గురవుతుండే పేద పిల్లలను దత్తత తీసుకునేందుకు టాయ్ బ్యాంక్ ఆలోచిస్తోంది.

మాజీ యూనియన్ శాఖా మంత్రి విజయ్ గోయల్ ఈ టాయ్ బ్యాంక్‌ను స్థాపించారు. ఒకసారి నిర్లక్ష్యానికి గురవుతోన్న వీధిబాలల్ని, పేద పిల్లల్ని చూసిన ఆయన "చక్కటి బాల్యం ఇలా దయనీయంగా సాగిపోతోందే..!" అని బాధపడ్డారు. వాళ్లకోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్న ఆయనకు.. పిల్లలకు ఆనందాన్నిచ్చేవి బొమ్మలే కదా అనిపించింది.

అయితే అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, టాయ్ బ్యాంక్‌నొకదాన్ని పెడితే ఎలా ఉంటుందని గోయల్ ఆలోచించారు. అంతే వెంటనే ఆచరణలో చూపెట్టారు. ఆయన ఆలోచన, కుమార్తెకు కూడా నచ్చటంతో ఆమె కూడా తన స్నేహితులతో కలిసి కాలనీలు, పాఠశాలలకు తిరిగి బొమ్మల్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అలా ఆవిర్భవించిందే ఈ టాయ్ బ్యాంక్.

గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తోన్న ఈ టాయ్ బ్యాంక్‌కి బొమ్మలను ఇచ్చినవారికి బ్యాంక్ తరపున ఒక ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తారు. మురికిగా ఉండే బొమ్మలను డ్రైక్లీనింగ్ చేసి, విరిగిపోయిన బొమ్మలను మరమ్మత్తు చేసి వీధి బాలలకు ఇస్తుంటారు. ఢిల్లీలోని పీతంపురాలోని ఆదర్సిలా గ్రంథాలయంలో కూడా ఈ బొమ్మలు ఉన్నాయి. ఇప్పటిదాకా మొత్తం లక్ష బొమ్మల్ని ఈ టాయ్ బ్యాంక్ సేకరించింది.

చూశారా పిల్లలూ... మనం ఆడుకుని పనికిరావని పక్కన పారవేసిన బొమ్మలకు మళ్లీ ప్రాణంపోసే టాయ్ బ్యాంక్ వలంటీర్లు, వాటిద్వారా వీధిబాలలకు, అనాథ పిల్లలకు ఎంత సంతోషాన్ని అందిస్తున్నారో..! కొత్త బొమ్మల్ని అందరికీ కొనివ్వడం ఎవ్వరికీ సాధ్యం కాదుగానీ... మనకు అవసరం లేని వాటిని ఇవ్వడం వల్ల వారికి ఆనందాన్నిచ్చినట్లు అవుతుంది. కాబట్టి.. వెంటనే మీకు ఇక వద్దు అనుకున్న బొమ్మల్ని మర్చిపోకుండా టాయ్ బ్యాంక్ వారికి అందిస్తారు కదూ...!

ఈ టాయ్ బ్యాంకుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం... విజయ్ గోయల్, 74 బార్బర్ రోడ్, బెంగాలీ మార్కెట్, ఢిల్లీ-110001 అనే అడ్రస్సుకు లెటర్ రాయడం ద్వారా తెలుసుకోవచ్చు. 91-(011)-23722020/23722626 అనే నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా కూడా అవసరమైన సమాచారం పొందవచ్చు. అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టాయ్‌బ్యాంక్.ఇన్ అనే వెబ్‌సైటు చూసినట్లయితే టాయ్‌బ్యాంక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు.