వేసవికాలంలో పగటిపూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువతుంటాయి. ఈ టెంపరేచర్ వల్ల కేవలం వేడి పెరగడమే కాకుండా పలు రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటివి ఎక్కువగా దాడి చేస్తాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే..
ఎండాకాలంలో ఆస్తమా మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఆస్తమా బాధితులు వేసవి కాలమంతా తమ వెంట ఆస్తమా ఉపశమన ఔషధాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది.
శోభి మచ్చలు సమస్య ఉన్నవారికి వేసవిలో ఈ బాధ మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే చర్మంపై ఫంగస్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. చర్మంపై మచ్చలు మరింత పెద్దగా అయ్యే అవకాశముంది. విపరీతంగా చెమట పడుతుంది. మచ్చలు ఉన్న చోట దురద, స్వల్పంగా మంట కూడా వస్తుంది.
శీతాకాలంలో లాగానే వేసవి కాలంలోనూ తీవ్రమై జలుబు చేసే అవకాశం ఉంటుంది. వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్ ఫ్లూయెంజా రకాలతో పాటు ఎంటెరో వైరస్‌లు సంక్రమిస్తాయి. చలికాలంలో సంక్రమించే వైరస్‌ల కన్నా ఇవి మరింత ప్రభావంతంగా ఉంటాయి.