ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

ఠాగూర్

మంగళవారం, 29 జులై 2025 (19:19 IST)
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లు ఐసీయూలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్ విజయోత్సవాలను జరుపుకుంటోందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో వాడివేడిగా జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు. భారత సేనల శౌర్య, ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. 
 
మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గాం దాడులు జరిగాయని, ఆ దాడి తర్వాత ఉగ్రవాదులు మట్టిలో కలుపుతామని ప్రతినబూనామన్నారు. ద్రోహులకు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని చెప్పాం. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని అఖిలపక్ష భేటీలోనూ చర్చించాం. పాక్ భూభాగంలో వెళ్లి ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేశామన్నారు. 
 
పాక్ ఎయిర్‌ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయన్నారు. అణు బాంబులు బెదిరింపులు చెల్లవని పాకిస్థాన్‌ను హెచ్చరించినట్టు తెలిపారు. 193 దేశాల్లో 190 దేశాలు ఆపరేషన్ సింధూర్‌ను సమర్థించాయని తెలిపారు. పాక్ కేవలం మూడు దేశాలే అండగా నిలిచాయన్నారు. ఆపరేషన్ సింధూర్‌ను కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్పుబడుతోందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేసి చూపుతోందన్నారు. 
 
భారత రక్షణ దళాల శక్తి, సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉందని, భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. తానెప్పుడూ భారత ప్రజల పక్షమేనని, భారతీయుల భావనలతో తన స్వరం మిళితం చేసుకుని ముందుకెళుతామని, ఆపరేషన్ సింధూర్ సమయంలో తనపై నమ్మకం ఉంచినందుకు దేశ ప్రజలకు రుణపడివున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు