మసాలా, కొవ్వులున్న పదార్థాలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:24 IST)
తీసుకునే ఆహారం ఏ మాత్రం తేడా ఉన్నా, సమయ పాలన లేక పోయినా గుండె మంట ఆరంభమవుతుంది. కడుపులోని కండరాలల్లో తేడానే కారణంగా గుండె మంట కలుగుతుందని చెప్పవచ్చు. మంటగా ఉండడం, మంట వలన కలిగే నొప్పి దాదాపు రెండు గంటల పాటు మనల్ని పట్టి పీడిస్తుంది. తిన్న తరువాత మరింత ఎక్కువ అవుతుంది. గుండె మంటకు చాలా కారణాలున్నాయి. 
 
వాటిలో మసాలా ఆహారం తీసుకోవడం ఒకటి. అలాగే ఎక్కువ కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడం కూడా గుండె మంటకు కారణమవుతుంది. పొగతాగడం వలన గుండె మంట వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గర్భిణీలలో కూడా గుండె మంట అధికంగానే ఉంటుంది. ఆహార సమయాన్ని పాటించకపోవడం, స్థూలకాయం కూడా ఇందుకు కారణమవుతాయి. 
 
తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. అన్నవాహిక అనేది పొడవాటి గొట్టంలా ఉంటుంది. చాతీ నుంచి నోటికి అనుసంధానం అయి ఉంటుంది. కడుపు దగ్గర లోయర్ ఎసోఫజియల్ స్ఫింక్టరే ఉంటుంది. కడుపు నుంచి వెనక్కు వచ్చే పదార్థాలను ఇది నిలవరిస్తుంటుంది. ఇది కనుక బలహీనమైతేనో, సక్రమంగా పని చేయకపోతేనో  కడుపులోంచి ఆమ్లాలు వెనక్కు ప్రయాణిస్తాయి. వీటి వలనే గుండెలో మంట పుడుతుంది. 
 
కడుపులో ఎక్కువైన ఆమ్లం ఒత్తిడి పెంచుతుంది. అక్కడ నుంచి అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. అన్నవాహిక యాసిడ్‌ను నిలవరించలేదు. యాసిడ్ అన్నవాహిక ద్వారా ప్రయాణించేటప్పుడు మంటగా అనిపిస్తుంది. 
 
గుండె మంటకు చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అరటిపండు కూడా మంచి ఫలితాన్నిస్తుంది. మసాలా ఆహారం తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. ఊరగాయ పచ్చళ్ళు తీసుకోకూడదు. ఇలా చేయడం ద్వారా ఎసిడిటీ, గుండె మంట తగ్గించుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు