భోజనం చేసిన వెంటనే కడుపు, ఛాతీ మంటగా అనిపిస్తే...

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (23:21 IST)
భోజనం చేసిన వెంటనే కడుపు, ఛాతీ, గొంతు భాగాల్లో మంటగా అనిపించేవారు, ద్రాక్షను, కరక్కాయ చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. లేత ముల్లంగి కషాయాన్ని, పిప్పలి చూర్ణంతో కలిపి తాగితే, అజీర్తి సమస్యలు తగ్గి, ఆకలి పెరుగుతుంది. 
 
అజీర్తి కారణంగా అతిగా దాహం వేయడం, వాంతి, వికారాలు కూడా వుంటే లవంగ కషాయాన్ని గానీ, జాజికాయ కషాయాన్ని గానీ తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవిస్తే వాంతి సమస్య చాలా త్వరితంగా తగ్గిపోతుంది. 
 
ఎండు రావి చెక్కను బాగా కాల్చి ఆ బూడిదను నీటిలో వేసి, ఆ నీటిని వడగట్టి తాగితే వాంతులు తగ్గుతాయి. మారేడు చెక్క, తిప్ప తీగె ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుని కషాయం కాచి తేనెతో తాగినా మంచి ఫలితం వుంటుంది. 
 
కానుక గింజల్లోని పప్పును కొంచెం వేయించి ముక్కలుగా కోసి, అప్పుడప్పుడు తింటూ వుంటే వాంతులు తగ్గుతాయి. ప్రతిరోజూ భోజనానికి ముందు అల్లం, సైంధవ లవణం కలిపి తీసుకుంటే అసలు ఈ సమస్య రాకుండా నిరోధించే అవకాశం వుంది.
 
ధనియాలు, శొంఠి ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసిన కషాయం సేవిస్తే అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి. ఉత్తరేణి వేరును నూరి నీటిలో కలిపి తాగినా ఈ సమస్యలు తొలగిపోతాయి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు