ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల రకాలను బట్టి, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది. వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది.
చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రిబోఫ్లేవిన్, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది.
చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ అధికంగా లభిస్తాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి.
గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది.