మన వెంట్రుకలు అతి నాజూకుగావుంటాయి. దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం, రసాయనాలతో కూడుకున్న షాంపూలు వాడడంవలన ఈ వెంట్రుకలు పొడిబారి, చిట్లిపోతుంటాయి. ఆ తర్వాత అవి బలహీనపడి రాలిపోతుంటాయి. వెంట్రుకలు రాలిపోవడాన్ని అరికట్టడానికి, అలాగే వాటిని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనావుంది. దీనికి కొన్ని ఉపాయాలున్నాయి. వీటిని పాటిస్తే మీ వెంట్రుకలు ఆరోగ్యంగానూ, గట్టిగా, మెరుస్తూవుంటాయి.
తలస్నానం చేసేటేప్పుడు మరింత వేడి నీటితో తలస్నానం చేయకూడదు. అలాగే తల తుడిచేటప్పుడు విపరీతంగా రుద్దకూడదు. తల తుడిచేటప్పుడు మెత్తటి తువాలును ఉపయోగించాలి. తలకు తువ్వాలు చుట్టి నీటిన పీల్చుకునేలా చేయాలి. వెంట్రుకలను దువ్వేటప్పుడు వెడల్పాటి దంతాలున్న దువ్వెనను వాడాలి. వెంట్రుకలు చెమ్మగానున్నప్పుడు ఎట్టిపరిస్థితులలోనూ దువ్వకండి. వెంట్రుకలను బాగా ఆరబెట్టి చిక్కులను విడదీయాలి.
మీ వెంట్రుకలు అందంగా నిగనిగలాడాలంటే మీరు తీసుకునే ఆహారంలో మంచి బలవర్దకమైన పోషక పదార్థాలుండేలా చూసుకోండి. తాజా పండ్లు, కాయగూరలతో ప్రొటీన్లతోబాటు కొవ్వు పదార్థాలుంటాయి. వెంట్రుకలు చెమ్మాగా ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితులలోనూ రబ్బర్ బ్యాండ్, లేదా మరే ఇతర క్లిప్పులు వాడకండి. రాత్రి పడుకునేటప్పుడు వెంట్రుకలకు రోలర్లు వాడకండి. ఇలా వాడడం వలన వెంట్రుకలు తెగిపోయే ఆస్కారంవుంది.
మీ వెంట్రుకలు నిగనిగలాడాలంటే ఆవాలనూనెలో నిమ్మకాయ రసం కలిపి వెంట్రుకల కుదుళ్ళవరకు పట్టించండి. మూడుగంటల తర్వాత తలస్నానం చేయండి. కుంకుడు కాయలు, శీకాకాయ, ఉసిరికాయలు సమపాళ్ళల్లో కలిపి పిండి చేసుకోవాలి. మూడు చెంచాల మిశ్రమాన్ని నీళ్ళల్లో నానబెట్టాలి. మూడు, 4 గంటల తర్వాత ఉడకబెట్టి వడగట్టండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో రెండు చెంచాల కొబ్బరినూనెను కలిపి వెంట్రుకలకు దట్టిస్తే వెంట్రుకలు నిగనిగలాడుతాయని వైద్యులు తెలిపారు.
వెంట్రుకలు నిగనిగలాడాలంటే గోరింటాకు, ఉసిరికాయను తప్పనిసరిగా ప్రయోగించండి. రెండు చెంచాల గ్లిజరిన్, 100 గ్రాముల పెరుగు, రెండు చెంచాల కొబ్బరినూనెను కలిపి మిశ్రమంగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు దట్టించి అరగంట వరకు ఉంచండి. ఆ తర్వాత తల స్నానం చేయండి. వెంట్రుకలకు చిక్కటి, పుల్లటి పెరుగు బాగా దట్టించండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దీంతో మీ వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి.