ఇవి ఎక్కువగా తింటే ఏమవుతుంది...? తెలుసుకోవాల్సిందే...

బుధవారం, 7 నవంబరు 2018 (16:41 IST)
కూరగాయలనగానే వాటిలో భారీగా పోషకాలు ఉంటాయనుకుంటాం. కానీ, వాటిల్లో కొన్ని ఏ కాస్త ఎక్కువగా తీసుకున్నా హాని కలిగిస్తాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, వాస్తవం ఇదే. హాని కారక ఆకుకూరలు, కూరగాయల్లో కొన్నింటి గురించి.... 
 
బ్రకోలి 
శరీర ఆరోగ్యానికి బ్రకోలి ఎంతో మేలు చేస్తుందనేది వాస్తవం. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాదు, కేన్సర్‌తో పోరాడే అంశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే వీటివల్ల కలిగే నష్టం కూడా తక్కువేమీ కాదు. తరుచూ తీసుకుంటే వీటిలోని కొన్ని రసాయనాలు థైరాక్సిన్‌ ఉత్పత్తిని తగ్గించి హైపోథైరాయిడిజం సమస్యకు దారి తీయవచ్చు. అందుకే అప్పటికే హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు బ్రకోలిని ఆహారంగా తీసుకోవడాన్ని మానుకోవడమే మేలు. 
 
పాలకూర 
శరీరానికి అత్యంత అవశ్యకమైన విటమిన్లు పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలకూర ఆక్సాలిక్‌ అనే ఆమ్లం కూడా ఉంటుంది. ఇది క్యాల్షియాన్ని, ఇనుమునూ శరీరం గ్రహించకుండా చేస్తుంది. అంతిమంగా ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. సలాడ్స్‌లో, వేరే రకంగా గానీ, పచ్చి పాలకూరను వాడే వారికి కూడా ఇది హానికరమే.
 
ఓమకూర 
ఎక్కువ పోషక విలువలున్న కూరల్లో ఇదొకటి. అలా అని దీన్ని ఎక్కువగా తింటే భారీ నష్టాన్నే మూట కట్టుకోవలసి వస్తుంది. ఎందుకంటే దీనిలో ఒక కఠినమైన పీచుపదార్థం ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అందుకే జీర్ణాశయ సమస్యలు అంతకుముందు నుంచే ఉన్న వారు ఈ కూర తినకపోవడమే మేలు. 
 
క్యాప్సికమ్‌ 
పంట సంరక్షణ కోసం రైతులు వేసే రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల మూలాంశాల్ని తనలో ఇముడ్చుకునే లక్షణం క్యాప్సికమ్‌లో చాలా ఎక్కువ. పూర్తిగా ఆర్గానిక్‌ విధానంలో పండించినవైతే ఫరవాలేదు కానీ సాధారణ విధానంలో పండించే క్యాప్సికమ్‌ను అతిగా తీసుకుంటే శరీరం త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
 
పచ్చిబఠాణీ
వీటిలో విటమిన్లతో పాటు పీచుపదార్థం కూడా ఎక్కువే. కేలరీలు, కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. బాగా పరిమితంగా తీసుకుంటే ఏమీ కాదు గానీ, కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్యలతో పాటు శరీరం బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు