ఊబకాయం. ఈ రోజుల్లో ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదొకటి. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడికి లోనవుతుంటారని, వారి జీవితంలోని లోపాలను వెతుక్కుంటూ, ఇతరులను నిందించే పనిలో వుంటారని ఓ అధ్యయనంలో తేలింది. ఐతే బరువు పెరగడం అనేది వ్యక్తిగత భావోద్వేగ సమస్యకు దారి తీస్తుందనే వాదనను పలువురు తోసిపుచ్చారు.
చాలా అధ్యయనాలు మానసిక ఆరోగ్యం మరియు బరువు సమస్య మధ్య స్పష్టమైన అనుబంధాన్ని కనుగొనలేదు. కానీ ఈ బరువు నడుము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నవారిలో సమస్య కనబడుతుంటుందని చెపుతున్నారు. సాధారణంగా కొవ్వు, చక్కెర, కేలరీలు ఎక్కువగా తీసుకోవడంతో రోజురోజుకీ అధిక బరువుతో సతమతమవుతుంటారు. ఫలితంగా వారిలో ఆందోళన, ఒంటరితనం, కోపంగా లేదా తక్కువ ఆత్మగౌరవంతో బాధపడుతుంటారని తేలింది.
అంతేకాదు పనిపట్ల శ్రద్ధ లేకపోవడం, బద్ధకంతో పాటు అతిగా తినడం వంటి లక్షణాలతో కూడిన మాంద్యం ఉంటుంది. ఊబకాయం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది నిరాశ, ఆందోళనతో ముడిపడి ఉంటుంది. అధిక బరువు కారణంగా శరీర ఆకృతిలో తేడాలు వస్తాయి కనుక ఆకర్షణీయతను కోల్పోతారు. ఫలితంగా సామాజిక వివక్షకు గురవుతూ, భావోద్వేగ ఒత్తిడి పెరిగి మరింత బరువు పెరగడానికి దారి తీయవచ్చు.
ఒకవైపు బరువు పెరుగుతున్నా ఏమాత్రం బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించకపోతే సమస్య మరింత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇతరులు తమను చూసి ఏమనుకుంటున్నారోనన్న మానసిక వ్యధతో వుంటుంటారు. కనుక అధిక బరువు అనర్థదాయకం. నిత్యం వ్యాయామం చేస్తూ శరీర బరువును నియంత్రణలో వుంచుకున్నవారికి ఆరోగ్యోంతో పాటు చక్కటి ఆలోచనలతో వుంటారు.