మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం గుండె. ఇది దేహం మధ్యలో లేదు. శరీరంలో మూడువంతుల పైభాగాన ఉంది. ఎందుకంటే, గురుత్వాకర్షణ కారణంగా రక్తాన్ని దిగువ భాగాలకు పంపించినంత సులభంగా శరీర ఎగువ భాగాలకు సాధ్యం కాదు కనుక. శరీరంలో దిగువ భాగాన గల రక్తనాళాలతో పోలిస్తే పైకి పోయే రక్తనాళాలు మరింత సున్నితంగా ఉంటాయి. అవి మెడలోకి చేరేసరికి తలవెంట్రుక కన్నా అతి సన్నగా ఉంటాయి. అవి రాను రాను ఎంత సూక్ష్మంగా మారుతాయంటే, ఒక్క రక్తపు బొట్టు ఎక్కువగా ప్రవహించినా రక్తనాళం చిట్లపోయి మెదడులో రక్తస్రావం అవుతుంది.
సరే... ఇక నిద్రలో ఉత్తర దిశగా తలపెట్టుకోరాదనే ఆచారం విషయానికి వద్దాం. రక్తహీనతకు డాక్టర్ ఏం మందిస్తాడు? ఐరన్ (ఇనుము). రక్తంలో చాలా ముఖ్యమైన మూలకం. మన భూగ్రహంపై అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయనే మాట వినే ఉంటారు. ఈ అయస్కాంత తత్త్వం మూలంగానే భూమి నిర్మాణం ప్రభావితం అయ్యిందంటే ఈ అయస్కాంత శక్తుల ప్రభావం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడు మనం ఏకంగా ఉత్తర దిక్కుగా తలపెట్టుకొని నిద్రిస్తే, మెదడులో రక్తనాళాలు చిట్లి, రక్తస్రావమవడానికి అవకాశం ఉంది. అది పక్షవాతానికి దారితీయవచ్చు.
ఇక నిద్ర లేచేటప్పుడు కుడిపక్కకు ఒత్తిగిల్లి లేవాలి. దేహం విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు జీవన వ్యవహార సరళి తగ్గు స్థాయిలో ఉంటుంది. మనం లేచినప్పుడు ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. మీరు ఎడమ వైపునకు తిరిగి లేస్తే ఎడమవైపు ఉండే గుండెపై ఎనలేని ఒత్తిడి కలుగుతుంది. అందువల్లే గుండెకు వ్యతిరేక దిశ అయిన కుడిపక్కకు ఒత్తిగిల్లి లేవాలనే ఆచరణను అమలులో పెట్టారు మన పూర్వీకులు.
మనం నిద్రలేచే ముందుగా అరచేతులను రుద్దుకొని, కనుల మీదుగా పెట్టుకొని, కనులు తెరవాలన్నది భారత సంప్రదాయంలో మరొకటి. మన నరాల చివర్లన్నీ అరచేతుల్లో దట్టంగా ఉంటాయి. మన రెండు చేతులు కలిపి రుద్దినప్పుడు ఆ నరాల చివర్లన్నీ ఒక్క మారుగా ఉత్తేజమవుతాయి. తద్వారా శరీర వ్యవస్థ అంతా జాగృతమవుతుంది. పడుకున్న స్థితి నుంచి మీ శరీరాన్ని కదిలించడానికి ముందుగానే మీ శరీరం, మెదడు కూడా క్రియాశీలం కావాలి. కేవలం ఏదో మొద్దులా, జోగుతూ నిద్రలేవరాదు. ఇదే ఇందులోని అంతరార్థం.