నేనూ భారతీయుడినే.. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా... అంటూ పెళ్ళి పేరుతో ఓ మహిళా టీచర్‌ను ఓ మోసగాడు నిండా ముంచాడు. పెళ్లి సంబంధాలు చూపిస్తానంటూ ఏకంగా రూ.2.5 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. ఆమెను మాయమాటలతో బురుడీ కొట్టించి ఏకంగా రూ.2.5 కోట్ల నగదును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తన భర్త మరణించాక ఆమె ఒంటరి జీవితం ప్రారంభించినా.. కొన్నాళ్లకు పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపింది. 2019లో అంతర్జాల వేదికపై పెళ్లి ప్రతిపాదనలు సమర్పించింది. అక్కడే ఆకాశ్‌కుమార్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు.
'నేనూ భారతీయుడినే. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా. ఓ ఇజ్రాయిల్ కంపెనీలో ఇంజినీరుగా పని చేస్తున్నా' అంటూ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవడానికి పరస్పరం అంగీకరించారు. ఆ మరుసటి సంవత్సరం.. 2020లో వేతనం రాలేదంటూ కొంత సొమ్ము కావాలని ఆకాశ్ విన్నవించడంతో ఆమె మనసు కరిగి కొంత నగదు జమా చేశారు.