వేసవికాలంలో తాటిముంజలు ఎక్కువగా లభిస్తాయి. ఇప్పటి ఎండవేడిమి నుండి బయటపడాలంటే.. రోజూ తాటిముంజలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముంజల్లో విటమిన్ ఎ, బి, సి, జింక్, పాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని అనవసర పదార్థాలను బయటకు పంపుతాయి. ముంజలు తీసుకోవడం వలన కలిగే మరికొన్ని ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
మలబద్దక సమస్యతో బాధపడేవారు తరచు తాటిముంజలు తింటే ఫలితం ఉంటుంది. రెగ్యులర్‌గా వీటిని తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే అసిడిటీ సమస్య కూడా తగ్గుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వలన వారి శిశువు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తాటిముంజలు కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా.. అందం పరంగా కూడా బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వలన మొటిమలు కూడా తగ్గుతాయి.
ఈ ముంజల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంది. వీటిని తినడం వలన పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ఈ కారణంగా త్వరగా ఆకలి వేయదు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ ముంజలు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. శరీరాన్ని చల్లబరిచే గుణాలు తాటిముంజలలో అధికమోతాదులో ఉన్నాయి. వీటిని తినడం వలన అలసట తగ్గుతుంది. మిగతా సమయాలతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో వీటిని తీసుకోవడం వలన అలసట, నీరసం దూరమై తక్షణ శక్తి పొందుతారు.