సాధారణంగా వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్ రావడానికి కారణంగా ఉండొచ్చు. కానీ కేవలం నైట్ డ్యూటీస్ వల్లనే డయాబెటిస్ వస్తుందని చెప్పడం కేవలం వారివారి అపోహ మాత్రమే. ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంది. ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేయడం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో డయాబెటిస్ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత కొద్ది మోతాదులో ఆహారం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
పీచు ఎక్కువగా ఉండే ముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. నైట్‌డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. ఖచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవడం ఉత్తమం. బరువును అదుపులో పెట్టుకోవాలి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్ బారిన పడకుండా చేయవచ్చు.