తమకు తెలిసిన వారిని గుర్తించి కూడా అబద్దం చెబుతున్న వారిని వారి కంటి కదలికలే పట్టించేస్తాయని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రత్యేకించి టెర్రరిస్ట్ సెల్స్, గ్యాంగులు వంటి నేర యంత్రాంగాలకు చెందిన ముఖ్యుల ఉనికిని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసు శాఖకు ఈ కొత్త ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఐ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. తాము గుర్తించిన ముఖాలను చూస్తున్నప్పుడు ప్రజల కళ్లు వివిధ రకాలుగా కదులుతాయని వారు గమనించారు. తమ నెట్ వర్క్‌లోని ఇతర నేరస్తుల గురించి తమకు తెలీదని పట్టుబడిన నేరస్థులు తరచుగా అబద్ధమాడుతుంటారు. కానీ అలా వారు అబద్ధం చెప్పినప్పటికీ ఆ గ్యాంగులోని అనుమానితుల ముఖాలను వారికి చూపిస్తున్నప్పుడు వాళ్లు అబద్ధమాడుతున్నదీ లేనిదీ ఆ క్షణంలో వారి కంటి కదిలికల బట్టి ఇట్టె చెప్పేయవచ్చని వర్శిటీ పరిశోధకులు చెప్పారు.
ఈ అధ్యయనంలో భాగంగా వర్శిటీ పరిశోధకులు 59 మంది వ్యక్తుల కంటికదలికలను రికార్డు చేశారు. ప్రత్యేకించి వారికి పరిచయం ఉన్న, పరిచయం లేని 200 మందికి చెందిన డిజిటల్ కలర్ ఫొటోగ్రాఫ్‌లను వారికి చూపిస్తూ వారి కంటి కదలికలను పరిశీలించారు. ఆ ఫోటోలను గుర్తించినప్పుడు అద్యయనంలో భాగమైన వారు తమకు ఆ వ్యక్తులెవరో తెలీదని అబద్దం చెప్పారు. కొన్నిసార్లు వారు తమకు తెలుసని నిజం చెప్పారు.
అపరిచిత వ్యక్తుల ఫోటోలను చూసేటప్పుడు కాకుండా, పరిచితుల ముఖాలను చూస్తున్నప్పుడు వ్యక్తుల కంటి కదలికలు మామూలు కంటే విభిన్నంగా కనిపించాయని ఈ బ్రిటన్ యూనివర్శిటీ పరిశోధకులు కనిపెట్టారు. మాటల్లో పలానా వ్యక్తి తనకు తెలీదని వారు అబద్ధమాడినా, పారి కంటి కదలికలు మాత్రం అసాధారణంగా కదలి వారు అబద్ధం చెబుతున్నారని స్పష్టం చేశాయ.
దాచిపెట్టిన వస్తువు లేదా వ్యక్తికి చెందిన అసలు గుర్తింపును, వాస్తవాన్ని కనిపెట్టేందుకు దశాబ్దాలుగా శాస్త్ర అధ్యయనాలు సాగిస్తున్న లాబరేటరీ ప్రయోగ పద్ధతులను బ్రిటన్ వర్శిటీ పరిశోధకులు గణనీయంగా మెరుగుపర్చారు.