కేన్సర్, ఇతర కీలక వ్యాధుల ఔషధాల ధర 25 శాతం తగ్గింపు

మంగళవారం, 7 జూన్ 2016 (11:06 IST)
ప్రాణాంతక క్యాన్సర్, మధుమేహం (డయాబెటీస్), రక్తపోటు (బీపీ), ఇతర బ్యాక్టీరియాతో తలెత్తే వ్యాధుల నివారణకు ఉపయోగించే 56 రకాల కీలక మందుల ధరలను సగటున 25 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దేశంలో ఔషధ ధరలను పర్యవేక్షించే సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ).. కీలక వ్యాధులకు ఉపయోగించే ధరలను తగ్గించడమే కాకుండా చిన్న ప్యాక్‌లలో లభించే గ్లూకోజ్, సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్ల లాంటి ఐవీ ఫ్లూయిడ్స్ (ఇంట్రావెనస్) ధరలను కూడా పెంచింది. 
 
డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) అమెండ్‌మెంట్ ఆర్డర్, 2016లోని షెడ్యూల్‌ను అనుసరించి 56 ఔషధాల ధరలను తగ్గించామని తెలిపింది. ప్రత్యేక చికిత్సా విభాగంలోని అన్ని మందులను అత్యవసర ఔషధాలుగా భావించి సాధారణ సగటు ఆధారంగా ధరలను స్థిరీకరించింది. అంతేకాకుండా ఏడాదిలో 10 శాతం మేరకు ఔషధాల ధరలను పెంచుకోవడానికి కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చింది. ఔషధాల ధరలను సగటున 25 శాతం తగ్గించాం. కొన్ని మందుల ధరను 10 నుంచి 15 శాతం, మరికొన్నింటిపై 45 నుంచి 50 శాతం మేరకు తగ్గించాం అని ఎన్‌పీపీఏ ఛైర్మన్ భూపేంద్ర సింగ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి