నా ఫోన్ ఎంగేజ్ వస్తే ఎవడితో మాట్లాడుతున్నావ్ అంటున్నాడు... టార్చర్ భరించలేకున్నా...

సోమవారం, 18 ఆగస్టు 2014 (16:21 IST)
నా వయసు 19 ఏళ్లు. నా బోయ్ ఫ్రెండ్ వయసు 20 ఏళ్లు. మేమిద్దరం గత 8 నెలలుగా ప్రేమించుకుంటున్నాం. ఈమధ్య నా బోయ్ ఫ్రెండుకు నాపై అనుమానం కలుగుతోంది. అతడు ఫోన్ చేసేటపుడు నా ఫోన్ ఎంగేజ్ వస్తే కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంటాడు. వెంటనే అవతల నేను ఎవరితో మాట్లాడుతున్నా కట్ చేసి అతడితో మాట్లాడాలి. అలా మాట్లాడినప్పటికీ ఎవడితో ఫోన్లో మాట్లాడుతున్నావ్ అంటూ అనుమానంగా మాట్లాడుతాడు. 
 
మెసేజ్ లు ఇస్తుంటాడు. వాటికి రిప్లై ఆలస్యమయితే ఇప్పటిదాకా ఏం చేశావ్. నేనంటే అంత పట్టింపులేని ధోరణా అంటూ మండిపడతాడు. ఇక సాయంత్రాలయితే అతడు రమ్మన్నచోటికి వెళ్లిపోవాలి. లేదంటే పెద్ద యుద్ధం చేసినంత పనిచేస్తాడు. అతడు నాకిచ్చే ముద్దులు, కౌగలింతలు... ఏమైనాసరే భరించాల్సిందే. ఏమాత్రం వ్యతిరేకించినా ఆరోజు ఇక నన్ను నిద్రపోనివ్వడు. ఫోన్లు చేస్తూనే ఉంటాడు. అతడంటే నాకు ప్రాణం. కానీ నాపై అతడికి ఎందుకింత అనుమానం... అతడ్ని మార్చగలనా లేదా...? అతడి టార్చర్ భరించలేకపోతున్నా...
 
కొంతమంది అబ్బాయిల్లో ఇలాంటి విపరీత ధోరణులు కనబడుతుంటాయి. వారు మాత్రమే నిజాయితీకి నిలువుటద్దమనీ, ఇక లోకంలో ఎవ్వరూ తనలా ఉండరనే భావనలో ఉంటుంటారు. ఐతే ఇతడి విషయం దానిని కూడా మించిపోయి ఉంది. డామినేటెడ్ మెంటాలిటీగా అగుపిస్తోంది. ప్రేమించినందుకు ప్రేమగా చూడాల్సింది పోయి హీనంగా ప్రవర్తిస్తున్నాడు. అతడి ప్రవర్తన ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ముఖ్యంగా అనుమానించడం అనేది భయంకరమైన వైకల్యం. 
 
ఇలాంటివారు నిత్యం అదే ఆలోచనలు చేస్తూ ఇతరుల మానసిక శాంతిని కూడా హరించేస్తారు. కాబట్టి అతడితో తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాల్సిందే. ఒకవేళ మార్చుకోలేకపోతే దూరంగా ఉండటం మంచిది. ఐనా మీ వయసు 20 ఏళ్ల లోపే అంటున్నారు. కాబట్టి ముందుగా కెరీర్ పై దృష్టి సారించండి. అతడికి మీపై ప్రేమ ఉంటే... మరికొంతకాలం వేచి ఉండమని చెప్పండి. ఓర్పుగా అతడు మీరు సూచించిన టైం వరకూ వేచిఉంటే అప్పుడు ఆలోచించండి.

వెబ్దునియా పై చదవండి