స్వీట్లు, టీ, కాఫీ, కూల్ డ్రింక్‌లను ఎక్కువగా తీసుకోవడం నోటి దుర్వాసనకు కారణమవుతుంది. చిగుళ్ల వ్యాధికి పంటిపై పేరుకున్న గార ద్వారానే నోటి దుర్వాసన ఏర్పడుతుంది. చిగుళ్ల సమస‌్యలు, కిడ్నీ జబ్బులు, స్త్రీలకు నెలసరి సమయంలో విడుదలయ్యే హార్మోన్లు, జీర్ణ సమస్యలు, తీసుకునే ఆహారం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. అలాంటప్పుడు సల్ఫర్ అధికంగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మేలునిస్తుంది.
నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే రోజూ ఉదయం, రాత్రి పంటిని శుభ్రంగా తోముకోవాలి. రెండుసార్లు దంతాలు శుభ్రం చేసుకోవడం వలన దంతాల మధ్య ఉన్న పాచిని తొలగించవచ్చు. దంతాల మధ్య పేరుకున్న పాచిని ఫ్లాసింగ్ వంటి పద్దతుల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ప్రతి ఆరునెలలకు ఓసారి దంతవైద్యుడి వద్దకు వెళ్లి నోటిని పరీక్షించుకోవాలి. పంటిపై ఏర్పడిన నల్లటి గారను స్కేలింగ్ ద్వారా తొలగించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
నోరు పొడిబారటం వల్ల కూడా దుర్వాసన వెలువడవచ్చు. నోట్లో ఉత్పత్తి అయ్యే లాలాజలం నోటిని శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుంది. దుర్వాసనకు దారితీసే పదార్థాలను కూడా శుభ్రం చేస్తుంది. కొంతమంది నోరు పొడి బారటమనే సమస్యతో బాధపడుతుంటారు. దాన్నే వైద్యపరిభాషలో జీరోస్టోమియా అంటారు. దాని వలన లాలాజల ఉత్పత్తి తగ్గి దుర్వాసనకు దారి తీస్తుంది.