శరీరంలో కఫాన్ని కరిగించే మిరియాలు, ఇంకా వీటితో ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

సోమవారం, 24 మే 2021 (22:36 IST)
కరోనావైరస్ విజృంభించిన మొదట్లో కొన్నాళ్లు కన్ఫ్యూజ్ అయినప్పటికీ ఆ తర్వాత వ్యాధి నిరోధక పెంచుకునేందుకు వంటింటి దినుసులు బాగా పనిచేస్తున్నాయని ఇపుడంతా వాటిని ఉపయోగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు చెక్క, లవంగాలు, శొంఠి, పసుపు, మిరియాలు వగైరాలు ఎప్పుడో ఒకసారి కొనుక్కునేవాళ్లం.
 
ఇపుడు షాపుల్లో ఈ దినుసులు అస్సల దొరకడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అంతా ఇపుడు వంటింటి దినుసులపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. వీటిలో మిరియాలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాం.
 
మిరియాలను నూర్చేటప్పుడు వెలువడే పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా ఉపయోగిస్తారు. దీంతో తలనొప్పి వంటి దీర్ఘవ్యాధులు నయం అవుతాయి.  జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడం, ఘాటైన వాసనను కలిగి ఉండడం వంటి గుణాల కారణంగా ఇవి శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి.
 
ఒక గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయి. మిరియాలు లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి నెట్టి వేసే శక్తి మిరియాలకు ఉంది. రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు కూడా ఇవి తోడ్పడుతాయి. 
 
మిరియాలు తీసుకునేవారిలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. శరీరంలో స్వేద ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి. అజీర్ణ సమస్యతో బాధపడుతున్న వారు మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. 
 
ఉదరంలో వాయువులు ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కండరాలు, నరాలు నొప్పిగా అనిపించినప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు భోజనానికి గంట ముందు అరగ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీళ్లు తాగితే గుణం కనిపిస్తుంది. 
 
అధిక దప్పిక ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది. పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు