ప్రాణాయామానికి సాధారణ శ్వాసకు తేడాలున్నాయి. సాధారణ శ్వాసలో తక్కువ మోతాదులో ఆక్సిజన్ తీసుకుని, తక్కువ మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ వదలడం జరుగుతుంది. అదే ప్రాణాయామం విషయానికి వస్తే ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ పీల్చుకుని ఎక్కువ మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ వదులుతాం.
సాధారణ శ్వాసక్రియలో శ్వాస తీసుకోవడం వేగంగా జరుగుతుంది. నిమిషానికి పన్నెండు నుంచి పదిహేను వరకూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుంటాయి. అదే ప్రాణాయామంలో శ్వాసక్రియ నిదానంగా జరుగుతుంది. నిమిషానికి ఐదు నుంచి 8 ఉచ్ఛ్వాస నిశ్వాసాలుంటాయి.
సాధారణ శ్వాసపై మనకు అదుపు ఉండదు. అది అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ప్రాణాయామంలో శ్వాస మీద ప్రత్యేక ధ్యాస ఉంటుంది. ప్రతి మార్పును గమనిస్తూ ఉంటాం.
సాధారణ శ్వాస తీసుకునేందుకు ఎటువంటి నిబంధనలు ఉండవు. అదే ప్రాణాయామం చేయడానికి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలను పాటించడం జరుగుతుంది.
సాధారణ శ్వాసలో చింతలూ, చికాకులూ మనల్ని వదిలిపెట్టవు. అదే ప్రాణాయమం విషయానికి వచ్చేసరికి మనలో ఆందోళనలు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శారీరక, మానసిక సమస్యలు క్రమంగా దూరమవుతాయి.