శత్రుదేశం పాకిస్థాన్‌కు ఇకపై పగటిపూటే చుక్కలు కనిపించనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ దేశంపై భారత్ కన్నెర్ర జేసింది. అనేక కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. సరిహద్దులను మూసివేసింది. భారత్‌లో పర్యటిస్తున్న పాక్ పౌరుల వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులంతా తక్షణం దేశం వీడి పోవాలంటూ డెడ్‌లైన్ కూడా విధించింది. ఇపుడు మరో కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.
భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మన దేశ విమానాల రాకపోకలపై పాకిస్థాన్ నిషేధం విధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని కేంద్రంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ దీనిపై భారత్ నిర్ణయం తీసుకుంటే, అది పాక్ ఎయిర్‌లైన్స్‌పై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పాక్ విమానాలు కౌలాలంపూర్‌లో సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్న దాటాల్సివుంటుంది.
ఇపుడు భారత్.. పాక్ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక దేశాల మీదుగా వెళ్లాల్సి వుంటుంది. ఇపుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణ పైనా అదనపు భారం పడుతుంది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోనుంది.