నేడు మహాశివరాత్రి... శివయ్యను ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే మంచిది...

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (09:11 IST)
దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కటకటలాడుతున్నాయి. దేశ వ్యాప్తంగా హరనామ స్మరణ మార్మోగుతోంది. ముఖ్యంగా, ముక్కంటి ఆలయాలు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున క్యూకట్టారు. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
శ్రీశైలంలో నేటి సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనుండగా, రాత్రి పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు శ్రీభ్రమరాంబదేవి-మల్లికార్జునస్వామి వార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.  
 
అదేసమయంలో ఈ పర్వదినాన శివయ్యను ఎలాంటి ద్రవ్యంతో అభిషేకిస్తే మంచిదో వేదపండితులు ఇలా వర్ణిస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెల్సిందే. శివలింగంపై కాసిన్ని నీళ్లు పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
అలాంటి శివలింగాన్ని నీళ్ళతో అభిషేకం చేసి, పూలు... పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి.... సకలైశ్వర్యములు సమకూరతాయని వేదపండితులు చెబుతున్నారు. 
 
నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. ఏ ద్రవ్యంతో భక్తులు  పరమ శివుడ్ని అభిషేకిస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం.
 
* నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
* తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.
* పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
* కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
* రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
* భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
* గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
* గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.
* బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
* నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
* ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
* పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
* ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
* చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
* మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
* ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
* ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింపజేస్తుంది.
* నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
* కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును.
* నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
* మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
* పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగగలవు.
* అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు        ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేస్తారు. ఆ అద్దిన  అన్నాన్ని  అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు