ఒక్కడే తినడం.. అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం.. మంచిది కాదు: విదురుడు

శుక్రవారం, 5 ఆగస్టు 2016 (18:20 IST)
పంచమవేదమైన మహాభారతంలో విదురుడు నీతికి నిదర్శనంగా వ్యవహరించాడు. అందుకే విదురనీతి ప్రసిద్ధి చెందింది. నీతినియమాలకు అనుగుణంగా, సత్యానికి వంతపాడే విదురుడు ధృతరాష్ట్రునికి నీతిబోధ చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ఏర్పడితే వంశం సర్వనాశనమవుతుందని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఏం చేయాలో తెలియక విదురుని వద్ద నీతిభోధ చేయమని అడుగుతాడు. విదురుడు కృష్ణద్వైపాయన వ్యాసుని పుత్రుడు. 
 
రాజా విచిత్రవీర్యుని భార్య అంబిక యొక్క దాసి గర్భాన జన్మించాడు. గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి మంత్రి. పాండవపక్షపాతి, న్యాయవాది, సత్యవాది, రాజనీతిలో మహానిపుణుడు. ఆయన నోటినుండి వెలువడిన ప్రతి నీతిమాట లోక ప్రసిద్ధం గాంచి విదురనీతిగా నిలిచిపోయింది. ధృతరాష్ట్రుడు ఎక్కువగా దిగులు చెందినప్పుడు విదురుడితో మనస్సు విప్పి మాట్లాడేవాడు. 
 
అలా ధృతరాష్ట్రుడు అడిగిన కొన్ని ప్రశ్నలకు విదురుడు సమాధానమిస్తూ.. నీతివల్లిస్తాడు. "రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోక హితమైన కార్యాలు చేయాలి. పరుల సంపదకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలసి బతకాలి. పొగడ్తలకు పొంగిపోకుండా, కోపాన్ని నిగ్రహించుకుని బతకాలి. 
 
తనను పాలించే రాజును, లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు. ధనము, విద్య, వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకువను ఇస్తే చెడువారికి మాత్రం అది గర్వాన్ని కలిగిస్తుంది.
 
తానొక్కడే తినడం... అందరూ నిద్రిస్తున్నప్పుడు.. ఒక్కడే ఆలోచించడం.. ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు. 
 
పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనాన్ని ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. తాను చెప్పిన లక్షణాలన్నీ ధర్మరాజులో ఉన్నాయని, వారిని నిరాదరణకు గురిచేశావు, వారికి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడమే ధర్మం అని.. పాండవులతో కౌరవులు కలిసున్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు.." అంటూ విదురుడు ధృతరాష్ట్రునికి హితవు పలికాడు.

వెబ్దునియా పై చదవండి