సుబ్రహ్మణ్యస్వామితో కోడిపుంజు ఎందుకు?

బుధవారం, 24 జులై 2019 (08:08 IST)
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? 
 
ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. 
 
తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు. వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.
 
 శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. 
 
తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు. ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. 
 
అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు. 
 
కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది. శూరపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. 
 
దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు