ఆదర్శమూర్తుల మేలుకలయికే రామాయణం

సోమవారం, 15 జులై 2019 (08:15 IST)
రామాయణము సకలవేదసారము, సర్వమానవులకూ ఆదర్శము. నాటికీ నేటికీ సర్వకాలాల్లోని మానవులకందరికీ రామాయణం లోని పాత్రలు ఆదర్శమై ఉంటున్నాయి. ఋగ్వేదము రామునిగా రూపుదాల్చగా, యజుర్వేదము లక్ష్మణునిగానూ, సామవేద భరతుని గానూ, అథర్వణవేదము శత్రుఘ్నునిగానూ రూపుదాల్చాయి. అందుకే రామాయణం సకలవేద సారమైంది.
 
నిజానికి రాముడు, అతని ముగ్గురుసోదరులూ దశరథ మహారాజుయొక్క పుత్రులుకారు, వారు అగ్ని నుంచీ ఉద్భవించిన వారు , కనుక వారి ప్రవర్తన సంపూర్ణంగా ధర్మబధ్ధమై ఉండినది. 
 
అసలు దశరథుడంటే  ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలతో కూడిన దేహమే. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నినుండి ఆవిర్భవించిన చైతన్య స్వరూపులు కనుక వారి స్వభావంకూడా అలాగే వెలుగొందింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నదమ్ము లందరికీ ఆదర్శమైనారు. పసితనం నుండీ కూడా వారు ఏనాడూ పరస్పరం పసితనంలో సైతం ఆటలందుకూడానూ కలహించుకోనేలేదు. ఐకమత్యంగా, అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని, ఆదర్శాన్ని అందించారు.
 
పసితనంలో  ఒకనాడు నలుగురూ కలిసి ఆడుకుంటున్నపుడు  ఉన్నట్లుండి భరతుడు పరుగెత్తు కుంటూ వచ్చి కౌసల్య వళ్ళో కూర్చుని ఏడ్చాడు. " కుమారా!ఎందుకేడుస్తున్నావు ? ఆటలో ఓడిపోయావా?" అని ఆమె అడగ్గా, భరతుడు, "అమ్మా! మీరన్నట్లు నేను ఓడితే ఆనందించేడిని. కాని, నేను ఓడే సమయంలో రాముడు కావాలని ఓడి నన్ను గెలిపించాడు. అన్న ఓటమికి నాకు చాలా బాధగా ఉంది" అన్నాడు. ఇలా పసి తనం నుండే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పరస్పరం ఎంతో ప్రేమగా, ఐకమత్యంగా, అన్యోన్యంగా జీవిస్తూ మానవులకందరికీ  అన్నదమ్ములెలా మెలగాలో ఆదర్శాన్ని అందించారు.
 
రాముడు పట్టాభిషేకం జరుగవలసిన సమయంలో అరణ్య వాసానికి వెళ్లవలసినా సంతోషంగా వెళ్లాడు. అంటే ఏది ఎదురైనా సంతోషించాలే కానీ బాధపడరాదనే ఆదర్శం. బాధపడ్డంత మాత్రాన వచ్చిన కష్టం తొలగదు. అడవులకు వెళుతున్న అన్నతో పాటుగా లక్ష్మణుడు ఎందుకెళ్లాడు అంటే అన్న కష్టం తనకష్టంగా భావించాడు, అన్నదమ్ముల అన్యోన్యతకు  ఇది ఉదాహరణ.  
 
భరతుడు ,శతృఘ్నునితోలకసి మేనమామ  ఇంటికెళ్ళి తిరిగి వచ్చేసరికీ రాముడు సీతాలక్ష్మణ సహితంగా అరణ్యానికి వెళ్ళిన విషయం తెల్సి బాధపడతాడు, పదునాలుగేళ్ళవరకు తిరిగిరాడని తెలుసుకొని వేదన చెందుతాడు. దీనికి కారణమైన తల్లిని దూషిస్తాడు, తల్లిని దూషించడం తప్పే ఐనా ఆమె అత్యాశతో తనకు చెందని రాజ్యాన్ని , జ్యేష్ఠపుత్రుడైన రామునికి అందవలసిన సిమ్హాసనాన్ని తన కోసం అన్యాయంగా ఆర్జించేప్రయత్నం చేసినందుకు తనకు కట్టబెట్టాలని ప్రయత్నించినందుకు. ఈవిధంగా ఆ నల్గురు సోదరులూ ఒకరికోసం ఒకరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడేవారు. 
 
రాముడు నారవస్త్రములు ధరించి అరణ్యానికి వెళ్ళడానికి సంసిద్ధుడై, తల్లికి చెప్పి వెళదామని ఆమె నివాసానికి వెళ్ళాడు. రాముడు పట్టాభీషేకం చేసుకోను చక్కగా అలంకరించుకొని  తన గృహానికి వస్తాడని ఆమె ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఎదురుచూస్తోంది. కాని, పట్టాభిషేకానికి తయారై రావలసిన రాముడు  నారవస్త్రాలు ధరించి రాగా  సీతారాములను చూసి నిశ్చేష్టురాలైన కౌసల్యకు రాముడు , చిరునవ్వు తో, ''అమ్మా! నా తండ్రి నన్ను అయోధ్యకుకాక అరణ్యరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను, మునులను రాక్షసుల నుండి కాపాడను నేను అరణ్యానికి వెళుతున్నాను. పితృవాక్య పరిపాలన నాకు ముఖ్యం " అంటాడు. అంటే అన్నీ పాజిటివ్ గానే స్వీకరించాలనే సందేశం ఇక్కడ దాగుంది.

అప్పుడు కౌసల్య, "నాయనా! నిజమే, నీవు పితృవాక్య పరిపాలన చేయవలసిందే! మరి నేను నీ మాతృమూర్తిని కదా! నిన్ను విడిచి నేను క్షణమైనా జీవించలేను. కాబట్టి, నీతోపాటు నన్నుకూడా అరణ్యా ని కి తీసుకొని వెళ్ళు," అని కోరుతుంది. అప్పుడు రాముడు, "అమ్మా!  నీ పతి నావియోగంతో దుఃఖములో మునిగియుండగా ఆయ నను వదలి నీవు నాతో అరణ్యానికి రావడం న్యాయం కాదు. ఇలాంటి సమయంలో నీవు ఆయన్నూ ఓదార్చి  బాధను తగ్గించాలి. అది నీ కర్తవ్యం. సతికి పతియే గతి కదా!" అని చెప్తాడు. ఇది భార్యాభర్తల ధర్మాన్ని తెలిపే ఆదర్శం. 
 
రాముడు  తన తల్లికి చెప్పినమాటలన్నీ విన్న  సీత రామునితో, "నాథా! సతికి పతియే దైవమని, పతిని సేవించమనీ అదే సతి ధర్మమని నీ తల్లికి బోధిస్తున్నావు నన్ను మాత్రం అయోధ్యలోనే ఉండి అత్తమామలను చూసుకోమంటున్నావు  ఇదేం ధర్మం ? నీ తల్లికొక ధర్మము, నాకొక ధర్మము ఉంటుందా?" అని అడుగుతుంది. ధర్మాధర్మ విచక్షణ, భర్తను అనుసరించాలనే సూచన ఇక్కడ కనిపిస్తుంది.
 
అప్పుడు కౌసల్య రామునితో, ''నాయనా! ధర్మము అందరికీ ఒక్కటే. నా కర్మను నేననుభవించక తప్పదు. సీతను మాత్రం నీవు బాధ పెట్టవద్దు. ఆమె ప్రార్థనను మన్నించి నీవెంట తీసుకొని వెళ్ళు. సర్వమును త్యజించి ఆమె నీతో అరణ్యానికి వస్తోంది. అని చెప్పింది. దీనిని బట్టి కౌసల్య వ్యక్తిత్వం ఎంత గొప్పదో, ఆమె హృదయం ఎంత విశాలమైనదో మనకు  తెలుస్తున్నది. కోడలిపట్ల అత్త మెలగాల్సిన తీరును ఆమె చెప్తున్నది.
 
తల్లీబిడ్డలయొక్క సంబంధం, అన్నదమ్ముల యొక్క సంబంధము ఎంత అన్యోన్యంగా, ఎంత పవిత్రంగా, ఎంత ఆదర్శ వంతంగా ఉండాలో రామాయణం నిరూపిస్తోంది.
 
కేవలం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులేగాక వారి ధర్మ పత్నులు సైతం గొప్ప ఆదర్శాన్ని అందించారు. సీత, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తిలు నల్గురూ గొప్ప గుణము కల్గినవారు. పరుల ఆనందమే తమ ఆనందముగా భావించేవారు. రాముడు అరణ్యానికి వెళ్ళేప్పుడు సీత, తన సర్వాభరణములను విసర్జించి రామునివెంట బయలుదేరింది.
 
లక్ష్మణుని భార్య ఊర్మిళ చిత్రకళలో గొప్ప ప్రావీణ్యం కల్గినది. ఆమె తన గదిలో కూర్చుని శ్రీరామపట్టాభిషేక ఘట్టాన్ని రంగులతో చక్కగా చిత్రింస్తున్నపుడు లక్ష్మణుడు అక్కడికి చెప్పిపోను వస్తాడు. 'ఊర్మిళా!' అని పిలువగానే ఆమె  గబుక్కునలేచి నిలబడగా అక్కడున్న రంగులన్నీ అమెకుతగిలి ఆమె గీసిన చిత్రంపై పడిపోతాయి.

ఆమె 'ఎంతో అందంగా గీస్తున్న  చిత్రము పాడైపోయిందే' అని బాధపడగా , లక్ష్మణుడు "ఊర్మిళా! లోకకళ్యాణకరమైన  శ్రీరామ పట్టాభిషేకాన్ని  కైకేయి చెడగొట్టింది. నీవు గీసిన చిత్రన్ని  నేను చెడ గొట్టాను. దీని గురించి నీవు బాధ పడనక్కర్లేదు. ఈ జగత్తులో సుఖ దుఃఖములు రెండూ సమానంగా ఉంటాయి. వాటిని మనం సమ త్వంతో స్వీకరించాలి." అని చెప్పి, తాను రాముని అనుస రిస్తున్నట్లు చెప్తాడు.
 
ఊర్మిళ గొప్ప త్యాగగుణసంపన్న.  తన భర్త తనను విడిచి వెళు తున్నాడని ఆమె విచారించలేదు.  అతని పాదాలకు నమస్కరించి ఆనందంగా వీడ్కోలు పలికింది. తాను ఆపద్నా గేళ్ళు అదే గదిలో నివసించింది. అంతేకాక ఆమె తన భర్తను అరణ్యంలో ఉన్నంత కాలం తనను తలంచక అన్న అవదినలకు సేవచేయడంలో గడపమని చెప్తుంది.
 
లక్ష్మణుని తల్లి సుమిత్ర కూడా సాధారణ మైందికాదు. ఆమె పేరుకు తగినట్లుగానే గొప్ప గుణవంతురాలు. గొప్పస్నేహ శీలి. సీతారా ములతో పాటుగా వారికి తోడుగా తానుకూడా అరణ్యానికి వెళుతున్నానని లక్ష్మణుడు చెప్పినప్పుడు ఆమె ఆనందంగా అంగీకరించింది. 
 
దశరథుని కుటుంబములో అంతాకలసి మెలసి ప్రేమగా జీవించేవారు. పొరపొచ్చాలేలేవు. అందువల్లే సుమిత్ర ప్రాస ప్రసాదాన్ని ఒక పక్షి ఎత్తుకుపోగా కౌసల్య, కైక ఆమెకు సగం సగం భాగం ఇచ్చారు. అందువల్లే సుమిత్ర తన ఇద్దరుకుమారులూ కౌసల్య పుత్రునితోనూ, కైక పుత్రునితోనూ కలసి పెరుగుతున్నా ఆతల్లులపట్ల కృతజ్ఞతగా వారిని అలానే ప్రేమగా కలసి పెరుగనిచ్చింది.

ఐతే ఇక్కడ మంకొక సందేహం కలుగవచ్చు, రాముడంటే అంత ప్రేంగ ఔంటున్న కైక అతడినెందుకు అడవులకు పంపేవరంకోరుకుంది ?. కైక చేసిన పనిత ప్పుకదా? ఆమె భర్తతో పోట్లాడడంవల్లనే కదా రాముడు అరణ్యానికి వెళ్ళవలసివచ్చింది, అని మనం అనుకోవచ్చు. అది పోట్లాట కాదు. అసలు కైకకు రాముడంటే చాలా ప్రేమ. తన కుమారుడైన భరతునికంటే రాముణ్ణి ఎంతో ప్రేమగా పెంచింది.
 
 కాని, సహవాస దోషమువలన ఆమె మనస్సులో  మార్పు వచ్చింది. మన  స్నేహితులను బట్టి మనం ఎలాంటివారమో ఇతరులు అంచనావేస్తారు. మంథర ప్రోద్బలం చేతనే కైకేయి అలాంటి కోరింది. ఐతే,  మంథర కైకకు అలా దుర్బోధ చేయనూ కారణం ఉంది  ఆమె ఆవిధంగా ప్రవర్తించడానికి ఒక కారణముంది.
 
ఒక మారు  కైకేయి తండ్రియైన కేకయరాజు అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఒకచోట అతనికి ఆడ, మగ జింకలు రెండు ఆడుకుంటూ కనిపించాయి. అతను వానిపై వేసిన ఒక  బాణం తగిలి వానిలోని మగజింక మరణిస్తుంది. ఆడ జింక ఏడుస్తూ తన తల్లి వద్దకు పోయి, ''అమ్మా! మేమిద్దరం కలసి ఆనందంగా ఆడుకుం టున్న సమయంలో కేకయరాజు నా భర్త తన బాణంతో చంపేశాడు.
 
 ఇప్పుడు నా గతేంటి?" అన్నది. అప్పుడా తల్లి జింక, ''అమ్మా! లోకంలో కష్టసుఖాలు రెండూ కలసి ఉంటాయి. మనం కష్టనష్టాలకు క్రుంగిపోకూడదు. వాటిని తట్టుకొని, నెట్టుకొని ముందుకు సాగిపోవాలి" అని తన బిడ్డను ఓదార్చింది. తరువాత ఆతల్లి జింక  కేకయ రాజువద్దకు వెళ్ళి, "రాజా! ఎవరైనా సరే, కర్మఫలన్ని  అనుభవించక తప్పదు. నేను చేసినా, నీవు చేసినా  తప్పక అనుభవించాల్సిందే. ఇప్పుడు నా అల్లుని మరణంతో నేను బాధపడుతు న్నట్లుగా  నీవు కూడా రానున్నరోజుల్లో నీ అల్లుని మరణంతో బాధపడితీరాల్సిందే."అని శపించింది.
 
 ఆ జింకయే మంథరగా జన్మించి , కైక బుధ్ధిని మార్చి కేకయరాజు అల్లుడైన దశరథుని మరణానికి కారకురాలైంది. ఇలా తల్లీబిడ్డలయొక్క సంబంధం, అన్నదమ్ముల యొక్క సంబంధం ఎంత అన్యోన్యంగా, ఎంత పవిత్రంగా, ఎంత ఆదర్శ వంతంగా ఉండాలో రామాయణం నిరూపిస్తున్నది.
 
 ఒకరికోసం ఒకరుగా రామాయణంలోని అన్ని పాత్రకూ జీవించాయి. అంతేకాక మన జన్మ జన్మల కర్మలన్నీ అనుభవించి తీరాల్సిందే కనుక ఎవ్వరినీ బాధించక వేధించక మంచి విధానాల్లో జీవించాలని కూడా మనకు రామా యణం ద్వారా ఉదాహరణ పూర్వకంగా తెలుస్తున్నది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు