ఆస్కార్... నట శిఖరాలు సైతం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే అవార్డు. ఈ వార్షిక అవార్డు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. భారతదేశమూ అందుకు మినహాయింపేమీ కాదు. ఆస్కార్‌లో భారతీయ చిత్రాలు, నటులకు లభించిన అవకాశాలు స్వల్పమే కావొచ్చు కానీ గత రెండు దశాబ్దాలుగా స్టార్ మూవీస్ ద్వారా ఆస్కార్ వేడుకలలో మన వాళ్లూ భాగమవుతున్నారు. స్టార్ మూవీస్‌తో పాటుగా స్టార్‌వరల్డ్ ఛానెల్స్‌పై 26 ఏప్రిల్ ఉదయం 5.30 గంటలకు అనుసరించి రాత్రి 8.30 గంటలకు ఈ వేడుకలను ఆ ఛానెల్స్‌పై పునఃప్రసారం చేయనున్నారు. ఆస్కార్ పండుగకు సిద్ధమవుతున్న వేళ గత రెండు దశాబ్దాలలో మరుపురాని ఆస్కార్ క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటే...
2001: ఆస్కార్ అంటేనే ఫ్యాషన్ పండుగ. కానీ ఎన్ని ఫ్యాషన్‌లు వచ్చినా 2001లో బీజోర్క్ ధరించిన హంస డ్రెస్ ఇప్పటికీ గుర్తుండిపోతూనే ఉంటుంది.
2002: ఆస్కార్ చరిత్రలో ఉత్తమనటిగా అవార్డు అందుకున్న మొట్టమొదటి, ఒకే ఒక్క నల్ల జాతి తారగా హాలీ బెర్రీ నిలిచారు. ఆ మరుసటి సంవత్సరమే ఆస్కార్ వేదికపై బ్రాడీ ఆమెను కిస్ చేసిన వైనం మరువతగునా?
2004: లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీ 11 ఆస్కార్‌లను గెలుచుకుంది.
2005: మిలియన్ డాలర్ బేబీ కోసం క్లింట్ ఈస్ట్‌ఉడ్ ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకుంటే, ఆ మరుసటి సంవత్సరం అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ క్రాష్ అవార్డు అందుకుంది. 2007లో ఎట్టకేలకు మార్టిన్ స్కోర్‌సీ ఉత్తమ దర్శకునిగా అవార్డు గెలుచుకున్నారు.
2010: ఉత్తమ దర్శకురాలిగా కాథరిన్ బిగీలో ఆస్కార్ గెలుచుకున్నారు.
2012: తన 82 ఏళ్ల వయసులో క్రిస్టోఫర్ ప్లమ్మర్ ఉత్తమ సహాయనటునిగా ఆస్కార్‌ను అందుకున్నారు.
2016: ఆస్కార్స్ తెల్లవారికి మాత్రమేనా అని చర్చను లేవనెత్తాడు క్రిస్‌రాక్. ఇక ఇదే సంవత్సరం లియోనార్డ్ డీకాప్రియో ఎట్టకేలకు ఆస్కార్ అందుకున్నాడు.
2020: మొట్టమొదటిసారిగా ఓ విదేశీ చిత్రం, అదీ ఇంగ్లీషేతర చిత్రం ఆస్కార్ అవార్డు అందుకుంది. దక్షిణ కొరియా చిత్రం పారసైట్‌కు ఆస్కార్ లభించింది. ఆస్కార్ చరిత్రలో కేవలం 11 సార్లు మాత్రమే ఆంగ్లేతర చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా ఆస్కార్ గెలుచుకున్నాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!