జామపండును ఆరగించేందుకు ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే, జామపండు తింటే త్వరగా జీర్ణం కావని, జలుబు చేస్తుందని అపోహ పడేవారూ లేకపోలేదు. అయితే అవన్నీనిజం కాదు. జామపండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండటంతో షుగర్ వ్యాధి గ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఉండే పీచు పదార్థం అరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
జామపండుపై తొక్కలో 'సి' విటమిన్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఏ, బి విటమిన్‌లు అధిక మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా పండులో కంటే దోరగా ఉండే కాయల్లోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని వైద్యుల అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా జామ ఆకులను చిగుళ్లవాపుకు మందులా కొంతమంది వాడుతుంటారు.
పండిన జామకాయల నుంచి జామ్స్, జెల్లీస్ వంటివి కూడా తయారు చేస్తున్నారు. జామ ఎసెన్స్‌తో ఇప్పుడు కూల్‌డ్రింకులు కూడా వస్తున్నాయి. పోషక ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం అధికమొత్తంలో లభ్యం కావటమేకాకుండా 28.55 శాతం పీచు పదార్థం లభ్యమవటంవల్ల జామకాయలను షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా వాడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.