నమ్మించి గొంతు కోసిన దాయాది దేశం

శుక్రవారం, 24 జులై 2020 (19:38 IST)
కార్గిల్ యుద్ధం ... దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాది పాకిస్థాన్‌పై మన సైన్యం సాధించిన మరుపురాని విజయం. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని పటాపంచాలు చేసిన ఇండియన్ ఆర్మీ... దాయాది దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమానపోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న "విజయ్ దివస్" నిర్వహిస్తోంది. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి ఈ నెల 26వ తేదీకి 21 యేళ్లు పూర్తికానుంది. 
 
హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్ - పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్‌ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఘటనతోనే రెండు దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు.
 
భారత్ - పాక్ నియంత్రణ రేఖ వెంబడి హియాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. భూభాగానికి 14-18 వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రదేశంలో ఉండే అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకుని భారత్‌ను దెబ్బతీయాలని పన్నాగం పన్నింది. 
 
ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుర్‌తుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్ కుయుక్తులు పన్నింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు రెండు దేశాల మధ్య శాంతి కోసం 'లాహోర్‌ ప్రకటన' చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ ఈ కుట్రకు బీజం వేశాడు. ఫలితంగా దాయాది దేశం చావుదెబ్బతిని అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు