నోరూరించే వెజిటేరియన్ సూప్ తయారీ

శనివారం, 31 మే 2008 (16:25 IST)
వేడిగా పొగలు కక్కుతూ ఉండే సూప్‌ను చెంచాతో తీసుకుని ఆరగించడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే బయట హోటల్లలో దొరికే చాలా సూప్‌లు నాన్‌వెజ్‌వే కావడం తెలిసిందే.

దాంతో సూప్ మీద ఎంత ఇష్టం ఉన్నా శాఖాహారులు వాటిని తీసుకోవడానికి జంకుతారు. అందుకే ఇలాంటి వారికోసం వెజిటేరియన్ సూప్‌ని పరిచయం చేస్తున్నాం.

ఈ వెజిటేరియన్ సూప్ తయారీకి కావలిసినవి : క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి, ఆలివ్ నూనె, చీజ్ 25 గ్రాములు, ఉప్పు, మిరియాలపొడి.

తయారుచేసే విధానం : క్యాబేజీ ఆకు ముకల్ని చిన్న ముక్కలుగా కత్తరించుకోవాలి. దీంతోపాటు అన్నిరకాల కూరగాయలను కూడా చిన్నపాటి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి స్టౌమీద పెట్టాలి. నూనె కాగగానే వెల్లుల్లి వేయాలి. తర్వాత తరిగిపెట్టుకున్న కూరగాయలు వేయాలి.

ఈ సమయంలో టమోటాలు మాత్రం వేయకూడదు. కూరగాయలు కొద్దిగా వేగగానే నాలుగు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి. కూరగాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత టమెటాలను కూడా వేసి బాగా ఉడికించాలి. చివరగా సరిపోయేంత ఉప్పు వేసి మళ్లీ ఉడికించాలి.

మొత్తం కూరగాయలు ఉడికి సూప్‌లాగా తయారైన సమయంలో స్టౌనుంచి దించేయాలి. ఇలా తయారు చేసిన సూప్‌ను వేడిగా ఉన్నప్పుడే చప్పరిస్తే ఆ రుచే వేరు.

వెబ్దునియా పై చదవండి