అతిపెద్ద విమానం తయారీకి చైనా సన్నాహాలు

ప్రపంచంలో అతిపెద్ద ప్రతిష్టాత్మక ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కోసం చైనా సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎయిర్‌బస్ ఏ320 అతిపెద్ద విమానంగా గుర్తింపు పొందింది. దీనికి ధీటుగా అతిపెద్ద విమానం తయారీకి చైనా ప్రయత్నిస్తుందని ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది.

ఈ ప్రతిష్టాత్మక ఎయిర్‌క్రాఫ్ట్‌ను అత్యవసర సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు, సముద్రంపై గస్తీ కోసం ఉపయోగించనున్నారు. ఈ భారీ విమానానికి "డ్రాగన్ 600" అని నామకరణం చేశారు. దీని నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం కూడా లభించిందని ఏవీఐసీ జనరల్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ హు హైయిన్ తెలిపారు.

ప్రతిపాదిత భారీ విమానంపై కంపెనీ ఇప్పటికే పరిశోధన ప్రారంభించిందని వెల్లడించారు. ఎయిర్‌బస్ ఏ320కి ధీటుగా ఉండే డ్రాగన్ 600ను అత్యవసర సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు, అడవుల్లో మంటలను ఆర్పివేసేందుకు, సమద్ర ప్రాంత గస్తీకి ఉపయోగిస్తారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువాతో హైయిన్ తెలిపారు.

వచ్చే పదిహేనేళ్ల కాలంలో చైనాలో సుమారు 60 డ్రాగన్ 600లు అవసరమవతాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన నాలుగేళ్లపాటు జరగవచ్చని, ఐదేళ్లలో వీటి ఉత్పత్తి ప్రారంభం కావచ్చొని హు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో కంపెనీ 1500 మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి