బ్రిటన్ ఎంపీల ఖర్చుల పూర్తి వివరాలను అధికారికంగా ఆన్‌లైన్‌లో ప్రచురితమయ్యాయి. ఎంపీల ఖర్చుల వివాదం బ్రిటన్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో వీటిని పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంచడం గమనార్హం. ఖర్చుల వివాదం కారణంగా బ్రిటన్ ప్రభుత్వానికి కొందరు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు.
అంతేకాకుండా ప్రధాని గోర్డాన్ బ్రౌన్ కూడా ఈ వివాదం కారణంగా ఇరకాటంలో పడ్డారు.
బ్రిటన్ పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ఎంపీల ఖర్చులకు సంబంధించి 1.2 మిలియన్ పేజీల పత్రాలను ఉంచారు. అయితే వీటి ద్వారా ఆశ్చర్యకర విషయాలేవీ వెలుగులోకి రాకపోవచ్చని డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.
కొన్ని వారాల క్రితం బ్రిటన్ మీడియాలో ఎంపీల ఖర్చుల వివరాలు ప్రచురితం అవడంతో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. పన్నుల ఎగవేత నుంచి, ఇళ్లు శుభ్రపరుచుకోవడం వరకు ఎంపీలు వివిధ రకాలుగా ఎలా ప్రజాధనాన్ని ఉపయోగించారో బ్రిటన్ మీడియా బయటపెట్టింది.