రావల్పిండిలోనున్న పాక్ సైనిక ప్రధాన కార్యాలయంపై తాలిబన్లు దాడులకు పాల్పడిన నాలుగు రోజుల తర్వాత గత రెండు రోజులుగా భద్రతా బలగాలు దాదాపు నలభైమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం రాజధాని లాహోర్‌లో పోలీసులు 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిలో లుక్మాన్ అనే వ్యక్తి వద్ద ఆత్మాహుతి చేసుకునేందుకు వాడే జాకెట్ లభించిందని పోలీసులు తెలిపారు.
వీరు దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు సిద్ధమైనారని, అందులో భాగంగానే వీరిని తాము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. తాము అదుపులోకి తీసుకున్న నలభైమంది అనుమానితులు లష్కర్-ఏ-ఝాంగవీ, సిపాహ్-ఏ-సాహబ్, సిపాహ్-ఏ-ముహమ్మద్, జైష్-ఏ-మొహమ్మద్‌లాంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వారని, వీరంతా కూడా పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
వీరిలో లుక్మాన్ అనే అనుమానితుడిని పాక్ వాయువ్య సరిహద్దు ప్రాంతానికి 75 కిలోమీటర్ల దూరంలోనున్న 16వ చెక్‌పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. లుక్మాన్‌కు అకీల్ అలియాస్ డాక్టర్. ఉస్మాన్‌తో సత్సంబంధాలున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.