స్వైన్ ఫ్లూ వైరస్ కారణంగా తమ దేశంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆర్జెంటీనా ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో అర్జెంటీనాలో ఈ వ్యాధి కారణంగా మృతి చెందినవారి సంఖ్య నాలుగుకి చేరింది. ఏ(హెచ్1ఎన్1) వైరస్ గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 160 మందికిపైగా మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అర్జెంటీనాలో మరో ముగ్గురు వ్యక్తులు స్వైన్ ఫ్లూతో మరణించారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావీన్స్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరోకరు అర్జెంటీనా రాజధానిలోనే మృతి చెందారు.
అంతకుముందు సోమవారం మూడేళ్ల శిశువు స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు అర్జెంటీనా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే అర్జెంటీనాలో కొత్తగా 138 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ దేశంలో మొత్తం స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల సంఖ్య 871కి చేరింది. దక్షిణ అమెరికా ఖండంలో స్వైన్ ఫ్లూ జాడలు ఎక్కువగా కనిపిస్తున్న రెండో దేశం అర్జెంటీనా కాగా, చిలీలో అత్యధికంగా 2335 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి.