అల్‌ఖైదాకన్నా తాలిబన్లే ధనికులు

అల్‌ఖైదా ఉగ్రవాదులకన్నా తాలిబన్ తీవ్రవాదులే అత్యధిక ధనికులని అమెరికా తెలిపింది. ఆఫ్గనిస్థాన్‌లోనున్న అమెరికా మరియు ఇతర సంస్థలపై మూకుమ్మడి దాడులకు పాల్పడేందుకు తాలిబన్లు వివిధ వర్గాలనుంచి డబ్బును సమకూర్చుకుంటారని అమెరికా పేర్కొంది.

అల్‌ఖైదా ఉగ్రవాదులకన్నా తాలిబన్ తీవ్రవాదులే అత్యధిక ధనికులని అమెరికాకు చెందిన ఉగ్రవాద నిర్మూలన కమిటీ ఆర్థిక వ్యవహారాల శాఖామంత్రి డేవిడ్ కోహెన్ తెలిపారు.

తాలిబన్లు ప్రపంచంలోని మాదకద్రవ్యాల వ్యాపారులు, పెద్ద పెద్ద స్మగ్లర్ల నుంచి డబ్బును వసూలు చేస్తారని, ఆ డబ్బులతోనే వారు తమ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

ఆఫ్గనిస్థాన్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోందని, ఇలాంటి వ్యాపారస్థుల నుండి తాలిబన్లు సొమ్ము రాబట్టుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు తాలిబన్లు తమ భవిష్యత్ కార్యాచరణల కోసం, అలాగే తమ జీవిత బీమా పాలసీలకు కూడా వారి నుండే సొమ్ము వసూలు చేస్తుంటారని తాము చేపట్టిన దర్యాప్తులో వెల్లడైనట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ఆఫ్గనిస్థాన్‌లో గత ఎనిమిది సంవత్సరాల క్రితంనాటి పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ఒబామా తన అధికారులతో సంప్రదింపులు జరిపి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

అక్కడికి తమ సైన్యాన్ని ఎందుకు పంపాల్సి వచ్చిందని, అలాగే అమెరికా సైన్యం కేవలం అల్‌ఖైదా తీవ్రవాదులపై దాడులకు పాల్పడాలా లేక తాలిబన్లు నేతృత్వం వహిస్తున్న ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టాల్సిన అవసరం ఉందా అనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి.

కాగా ప్రస్తుతం అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ డబ్బు కొరతతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని, దీంతో తన ప్రాభవాన్ని కోల్పోతోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అల్‌ఖైదా తన కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేయాలని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి