ఇంగుషెటియా అధ్యక్షుడిపై హత్యాయత్నం

దక్షిణ రష్యా రిపబ్లిక్ ఇంగుషెటియా అధ్యక్షుడిపై సోమవారం హత్యాయత్నం జరిగింది. ఇంగుషెటియా అధ్యక్షుడు యూనస్- బెక్ బామాట్‌గిరెయెవిచ్ యెకురోవ్ ఈ హత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రోజు ఉదయం యెకురోవ్ ప్రయాణిస్తున్న వాహణశ్రేణిని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది.

ఇంటర్‌ఫాక్స్, ఆర్ఐఏ- నోవాస్తీ వార్తా సంస్థలు ఈ మేరకు వార్తలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో అధ్యక్షుడితోపాటు, మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని ఐటీఏఆర్- టాస్ అనే వార్తా సంస్థ తెలిపింది.

కొన్ని రోజుల క్రితం ఇంగుషెటియా రాజధాని నజ్రాన్‌లో జరిగిన సాయుధ దాడిలో ఆ దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బషీర్ అషెవ్ మృతి చెందారు. ఇంటిబయట ఉన్న బషీర్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సమస్యాత్మక కాకసస్ ప్రాంతంలో (యూరప్, ఆసియా సరిహద్దుల్లోని నల్లసముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉన్న పెద్ద పర్వత ప్రాంతాన్ని కాకసస్‌గా పిలుస్తారు) బషీర్ అషెవ్‌కు ముందు మరో ఇద్దరు ప్రముఖ నేతలు కూడా హత్య చేయబడ్డారు. తాజాగా ఇంగుషెడియా అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది.

వెబ్దునియా పై చదవండి