ఇతర దేశాలకు జపాన్ అణు సాయం

ఇతర దేశాల అణు విద్యుత్ ఉత్పత్తిలో సాయం చేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర దేశాలకు సాయం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను తీర్చేందుకు అణు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో విదేశాలకు సాయం చేస్తామని ప్రకటించడం గమనార్హం.

ఇందుకోసం జపాన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు శక్తి సహకార మండలి (ఐఎన్ఈసీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ మండలి విదేశీయులకు అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రూపకల్పనపై శిక్షణ ఇవ్వనుంది.

స్వదేశాల్లో అణు విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణకు ఉపయోగపడే విధంగా విదేశీయులకు జపాన్ ప్రభుత్వం ఈ శిక్షణ అందజేయనుంది. అంతేకాకుండా అణు విద్యుత్ ప్లాంటుల సురక్షిత నిర్వహణ కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయల అభివృద్ధిలోనూ జపాన్ ప్రభుత్వం సాయం చేయనుంది.

వెబ్దునియా పై చదవండి