ఇరాన్‌పై ప్రపంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు

ఇరాన్‌లో తాజా పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నాయి. ఇరాన్‌లో ఇటీవల జరిగిన అధ్యక్షలు వివాదాస్పమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగిందని, అక్రమాల కారణంగానే అహ్మదీనెజాద్ తిరిగి ఇరాన్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా ఎన్నికల ఫలితాలపై గత కొన్ని రోజులుగా ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వీటిలో వేలాది మంది పౌరులు పాల్గొంటుండటం ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అహ్మదీనెజాద్ ప్రభుత్వాన్ని గతంలోనూ లక్ష్యంగా చేసుకున్న పశ్చిమదేశాలు తాజా ఎన్నికల అనంతరం దేశంలో నిరసనలు వెల్లువెత్తుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఇరాన్ ఆర్థిక భాగస్వామ్య దేశాలు మాత్రం ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం అభిప్రాయాలను పక్కనబెడితే ఇరాన్‌లో పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించని అహ్మదీనెజాద్ ప్రధాన ఎన్నికల ప్రత్యర్థి, మాజీ ప్రధాని మీర్ హుస్సేన్ మౌసావి నేతృత్వంలో అక్కడ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

1979నాటి ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్‌లో ఈ స్థాయిలో ఆందోళన జరుగుతుండటం ఇదే తొలిసారి. అమెరికా, దాని మిత్రదేశాలు గత కొన్నేళ్లుగా ఇరాన్ వివాదాస్పద యురేనియం శుద్ధి కార్యక్రమంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. దానిపై ఆంక్షలు విధించాయి. తాజా ఎన్నికల ఫలితాల అనంతరం ఇరాన్‌లో జరుగుతున్న విధ్వంసకాండపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల హక్కులను గౌరవించాలని సూచించింది.

మరికొన్ని పశ్చిమ దేశాలు కూడా ఇరాన్ నాయకత్వంపై దుమ్మెత్తిపోశాయి. అనుమానాస్పద ఓట్ల రిగ్గింగ్‌ను ఖండించడంతోపాటు, ప్రతిపక్ష ర్యాలీలపై భద్రతా దళాల బలప్రయోగాన్ని తప్పుబట్టాయి. ఇదిలా ఉంటే చైనా, వెనిజులా, మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి

చైనా అధ్యక్షుడు హు జింటావో ఇరాన్ ఎన్నికల ఫలితాలను స్వాగతించారని, వీటిలో విజయం సాధించిన అహ్మదీనెజాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఇరాన్ తాజా ఎన్నికలను చట్టబద్ధమైనవిగా చైనా ప్రభుత్వం అంగీకరించినట్లు పేర్కొంది. ఇరాన్ ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇరాన్ రాజకీయాల్లో అమెరికా జోక్యాన్ని చైనా ప్రభుత్వ మీడియా తన సంపాదకీయంలో ఖండించింది.

వెబ్దునియా పై చదవండి