ఉగ్రవాదాన్ని ఇస్లాంతో ముడిపెట్టకండని పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్(పీఎమ్ఎల్-ఎన్) అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హింస వేళ్ళూనుకుందని, దీనిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు రఫీక్ తరార్, ధార్మిక విద్వాంసుడు మౌలానా తారిక్ జమీల్‌తో షరీఫ్ సమావేసమై పై విధంగా స్పందించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము పార్టీలకు అతీతంగా పనిచేస్తామని, ప్రజల మేలుకోరే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇందులో కేవలం పాకిస్థాన్ ఒక్కదేశమే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదని, దీనికి అన్ని దేశాల సహకారం అవసరమని ఆయన వారితో చర్చించారు.
ఇదిలావుండగా దేశంలోని ప్రస్తుత తాజా పరిస్థితులపై, ప్రజల సౌభాగ్యంకోసం తీసుకోవలసిన చర్యలగురించి చర్చించినట్లు సమాచారం. కాగా తాము, తమ పార్టీ సభ్యులు పంజాబ్‌లో చట్టపరమైన మార్పులు తీసుకువచ్చి పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా వారిరువురితో చర్చించినట్లు సమాచారం.