పాకిస్థాన్‌కు సబ్‌మెరైన్ విక్రయాలపై ఫ్రాన్స్ ప్రభుత్వం కమీషన్ చెల్లించనందు వలనే 2002లో 11 మంది ఫ్రెంచ్ ఇంజనీర్లు హత్య చేయబడ్డారని బాధిత కుటుంబాల తరపు న్యాయవాది గురువారం పేర్కొన్నారు. కమీషన్ చెల్లించకపోవడం వలనే పాకిస్థాన్‌లో వీరి హత్యలు జరిగాయని తెలిపారు.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వస్ చిరాక్, మాజీ ప్రధానమంత్రి అడ్వర్డ్ బలాదూర్ సబ్‌మెరైన్ విక్రయాలపై పాకిస్థాన్‌కు కమీషన్ చెల్లింపులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారని, ఈ చెల్లింపులు నిలిచిపోయిన కారణంగానే ఫ్రెంచ్ జాతీయులను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌లో దాడి జరిగిందని న్యాయవాది పేర్కొన్నారు.
ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ఇద్దరు ఫ్రెంచ్ తీవ్రవాద నిరోధక దర్యాప్తు కోర్టు న్యాయమూర్తులు గురువారం బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాల తరపు న్యాయవాది ఆలీవర్ మోరిస్ విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో 2002, మే- 8న జరిగిన తీవ్రవాద దాడిలో 11 మంది ఫ్రెంచ్ సబ్‌మెరైన్ ఇంజనీర్లు హత్య చేయబడ్డారు.
వీరందరూ ఫ్రాన్స్ ప్రభుత్వ రంగ సంస్థ డీసీఎన్‌లో పనిచేస్తున్నారు. డీఎన్ఎస్ పాకిస్థాన్‌కు సబ్‌మెరైన్‌లు నిర్మించి ఇచ్చింది. సబ్‌మెరైన్‌ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఫ్రాన్స్ ఇంజనీర్లు 2002లో కరాచీలో ఉన్నారు.
11 మంది ఫ్రెంచ్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న మినీబస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలు నింపిన వ్యానుతో ఢీకొట్టడంలో అందులోని వారందరూ మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు పాకిస్థానీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ కారణమనే అనుమానులు ఉన్నాయి. అయితే ఈ దాడికి అల్ ఖైదా కారణమనే వాదన తేలిపోయిందని, కమిషన్ల చెల్లింపు నిలిపివేయడమే ఇందుకు అసలు కారణమని మోరిస్ పేర్కొన్నారు.