కరాచీ సంక్షోభం: స్పందించిన పాకిస్థాన్ సుప్రీం కోర్టు
మంగళవారం, 23 ఆగస్టు 2011 (11:24 IST)
పాకిస్థాన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ ఛౌధరీ ఆ దేశ వాణిజ్య రాజధాని కరాచీలో జరుగుతున్న హింసపై స్పందించి సుమోటా కేసుగా స్వీకరించారు. హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఫూటేజ్‌ను అందించాలని వార్తా ఛానళ్లను ఆదేశించారు.
దేశ అతిపెద్ద నగరంలో జరుగుతున్న హత్యలపై ఛీఫ్ జస్టిస్ స్పందించాలని పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన లేఖపై ఛౌధరీ స్పందించారు. ఈ లేఖ మానవ హక్కుల కేసుగా మారినట్లు పాక్ సర్వోన్నత న్యాయస్థాన అధికారులు వెల్లడించారు. నగరంలో హింసకు సంబంధించిన దృశ్యాలను అందించాలని కోరిన ప్రధాన న్యాయమూర్తి కరాచీ అశాంతిపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
గత వారం జరిగిన హింసలో కరాచీలో సుమారు వందమంది చనిపోయారు. కిడ్నాపులు, మర్డర్లు చోటుచేసుకొన్నాయి. పోర్ట్ సిటీలో హింస కట్టడికి అధికారులకు ఆదేశాలు జారీచేయాలని సింధ్ హైకోర్టులో ఇప్పటికే పిటీషన్ దాఖలైంది. 2011 తొలి ఆరు నెలల్లో 490 మంది ప్రజలు చనిపోయినట్లు పాకిస్థాన్ మానవహక్కుల సంఘం వెల్లడించింది. 2010 మొత్తం మీద 748 మంది మరణించారు. ఇవి అన్ని పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న హత్యలని మానవహక్కుల సంఘం ఆరోపించింది.