కిర్గీజ్‌స్థాన్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడి కుర్మాన్‌బెక్ బాకియెవ్ తిరుగులేని విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో బాకియెవ్ ప్రత్యర్థులపై అఖండ మెజారిటీతో విజయం సాధించినట్లు ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోవారం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమయ్యాయని యూరోపియన్ పరిశీలకులు వాదిస్తున్నారు.
బాకియెవ్ కిర్గీజ్‌స్థాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ఇది రెండోసారి. ఆయనకు గత గురువారం జరిగిన ఎన్నికల్లో 76.12 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ఫలితాలను కిర్గిజ్‌స్థాన్ ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి అల్మాజ్‌బెక్ అతామ్‌బాయెవ్‌కు 8.41 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఎన్నికల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన తాజా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. అయితే ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని, అవి చెల్లుబాటు అవతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజా ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదయింది. ఈ మాజీ సోవియట్ రిపబ్లిక్ అధ్యక్ష పగ్గాలను బాకియెవ్ తిరిగి చేపట్టనున్నారు.